జనసేన అధినేత పవన్ను ఎలాగైనా ఎన్నికల ప్రచారంలోకి దించాలని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు నానా అవస్తలు పడుతున్నారు. అందుకనే కాబోయే సీఎం పవనే అని, మోడి, అమిత్ షాకు పవన్ చాలా ఇష్టుడని ఏవేవో డైలాగులు చెబుతున్నారు. నిజంగానే వాళ్ళిద్దరికి పవన్ అంత ఇష్టుడే అయితే మోడి ఎందుకని అపాయింట్మెంట్ ఇవ్వటంలేదు. చివరగా నాలుగుసార్లు ఢిల్లీకి వెళ్ళిన పవన్ ప్రధానమంత్రిని కలవకుండానే వెనక్కు తిరిగి వచ్చేసిన విషయం తెలిసిందే.
నిజానికి మిత్రపక్షంగా పవన్ కు ఇవ్వాల్సినంత మర్యాద బీజేపీ ఏరోజూ ఇవ్వలేదు. తిరుపతిలో పోటీచేయబోయేది బీజేపీ అభ్యర్ధే అని స్వయంగా వీర్రాజు దాదాపు నాలుగు నెలల క్రితమే ఏకపక్షంగా ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఒకవైపు మిత్రపక్షమని అంటునే మరోవైపు పవన్ నోరు నొక్కేస్తున్నారు. తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా రత్నప్రభ రంగంలోకి దిగారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రత్నప్రభ గురించి పార్టీలోనే చాలామంది తెలీదు. పార్టీ నేతలకే తెలీని అభ్యర్ధి గురించి ఇక మామూలు జనాలకు ఏమి తెలుస్తుంది. గ్రౌండ్ లెవల్లో వాస్తవాలను తెలుసుకున్న తర్వాత వీర్రాజుకు విషయం అర్ధమైనట్లుంది. మొన్నటి ఎన్నికల్లో లాగే రేపటి ఎన్నికల్లో కూడా డిపాజిట్ రాకపోతే పరువుపోతుంది. నిజంగానే రత్నప్రభకు గనుక డిపాజిట్ దక్కకపోతే పోయేది వీర్రాజు పరువే కానీ అభ్యర్ధికి ఏమీకాదు.
వీర్రాజు కానీ లేదా ఇపుడు ఉపఎన్నికలో తిరుగుతున్న నేతల్లో ఎవరికి కూడా పట్టుమని వంద ఓట్లు వేయించేంత సీన్ లేదు. అందుకని పరువు నిలుపుకోవాలంటే పవన్ను ప్రచారంలోకి దించటం ఒకటే మార్గం. అందుకనే పవన్ కు వీర్రాజు బిస్కెట్లు వేస్తున్నారు. అంటే పవన్ రంగంలోకి దిగితే బ్రహ్మాండమేదో బద్దలైపోతుందని కాదు. కానీ కనీసం గౌరవప్రదమైన ఓట్లన్నా రాకపోతుందా అన్న ఆశంతే. మరి వీర్రాజు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో భవిష్యత్తే తేల్చాలి.