విశాఖ ముహుర్తం ఫిక్స్… సీఎం ధైర్యం ఏంటి?

రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌న్న‌.. త‌న క‌ల‌ను, ప‌ట్టుద‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ అంతే వేగంగా పావులు క‌దుపుతున్నారు. అమ‌రావతిని కేవ‌లం ఓ సామాజిక వ‌ర్గం కోస‌మే నిర్మాణం చేశార‌న్న ఆయ‌న దానిని కేవ‌లం చ‌ట్ట‌స‌భ‌ల రాజ‌ధానిగా ఉంచేసి.. విశాఖ‌లో పాల‌నా రాజ‌ధాని, క‌ర్నూలులో న్యాయ రాజ‌ధాని ఏర్పాటు చేయ‌డం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధిని స‌మ‌తుల్యం చేస్తామ‌ని.. త‌ద్వారా.. రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తినే కావాలంటూ.. అక్క‌డి ప్రాంత రైతులు, ప్ర‌జ‌లు ఉద్య‌మిస్తున్నారు.

అదే స‌మ‌యంలో న్యాయ పోరాటం కూడా జ‌రుగుతోంది. మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ మ‌రికొద్దిరోజుల్లోన‌నే ప్రారంభం కానుంది. అయితే… ఇప్ప‌టికే విశాఖ‌కు పాల‌నా రాజ‌ధానిని త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం జ‌గ‌న్ ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా.. నిర్ణ‌యించిన ముహూర్తం మే 6వ తేదీ నాటికి అక్క‌డికి చేరిపోవాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విశాఖ‌లో అనేక చ‌ర్య‌లు తీసుకున్నారు. విశాఖ విమానాశ్ర‌యంలో ప్ర‌స్తుతం ఉన్న విమానాల సంఖ్య 43 నుంచి 58కి పెంచారు. దీనికి కొన్నాళ్ల కింద‌టే కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించిన‌ట్టు తాజాగా తెలిసింది.

అదే స‌మ‌యంలో విశాఖ‌లో కీల‌క ర‌హ‌దారుల‌ను భారీ ఎత్తున విస్త‌రిస్తున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఏర్పాటు చేసేందుకు అనువైన భ‌వ‌నాల ఎంపిక కూడా పూర్త‌యిన‌ట్టు తెలిసింది. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాలు నిరంత‌రం అక్క‌డ ఏర్పాట్ల‌ను ప‌రిశీలిస్తున్నాయి. అక్క‌డ మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు ఎన్ని నిధులు కావాల‌న్నా.. ప్ర‌భుత్వం వెనుకాడ‌కుండా ఇస్తోంది. అయితే.. ఇదంతా చేయ‌డం వెనుక మ‌రో రీజ‌న్ కూడా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అదేంటంటే.. ప్ర‌స్తుతం హైకోర్టులో జ‌రుగుతున్న విచార‌ణ తుదిద‌శ‌కు చేరుకునే లోపే.. విశాఖ‌లో 50 శాతం పాల‌న ప్రారంభం కావాలి. లేక‌పోతే.. సుప్రీం కోర్టులో కీల‌క న్యాయ‌మూర్తులు మారే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే.. మార్పు ఆగిపోయే ప్ర‌మాదం కూడా ఉంది. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. అంతా ముంద‌స్తుగా జ‌రిగేలా ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆల్డ్రెడీ ఏర్పాటైన రాజ‌ధానిని త‌ర‌లించే సాహసం ఎవ‌రూ చేయ‌రు క‌నుక‌.. జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.