ఏపిలో మళ్ళీ హై అలర్ట్ ?

కరోనా సమస్య తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరిగిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే వేలాది కేసులు ప్రతిరోజు బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో రాత్రుళ్ళు కర్ఫ్యూ, రాత్రిళ్ళు లాక్ డౌన్ పెట్టిన విషయం తెలిసిందే. ఎన్ని కఠినచర్యలు తీసుకున్నా కరోనా వైరస్ కేసుల సంఖ్య అయితే పెరిగిపోతున్నాయి. ఇపుడీ ఈ జాబితాలో ఏపి కూడా చేరుతున్నట్లే ఉంది.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో వెయ్యికేసులు బయటపడ్డాయి. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు నిర్వహించిన 31142 కేసుల్లో 1005 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అవ్వటం సంచలనంగా మారింది. ఇంతకుముందు అంటే గడచిన 15 రోజులుగా ప్రతిరోజు వందల్లో మాత్రమే నమోదవుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా వెయ్యిమార్కును దాటడం ఆశ్చర్యంగా ఉంది.

అలాగే గడచిన 24 గంటల్లో చిత్తూరు, కృష్ణాజిల్లాల్లో చెరోకరు కరోనా వైరస్ కారణంగానే మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారిసంఖ్య 7205కి చేరుకున్నది. నిజానికి ఈ సంఖ్య పెద్దదనే చెప్పాలి. అయితే ప్రభుత్వం తీసుకున్న అనేక ముందస్తు, కఠిన చర్యల కారణంగానే సంఖ్య ఇంతటితో ఆగింది. లేకపోతే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ ,తమిళనాడు, కర్నాటకలతో పోటీపడుతుండేది. ఇదే సమయంలో కరోనా బారినపడి కోలుకున్న వారిసంఖ్య 8,86,216గా నమోదైంది.

గడచిన 24 గంటల్లో ఎక్కువగా నమోదైన కేసులు నాలుగు జిల్లాలో కనబడుతున్నాయి. గుంటూరులో అత్యధికంగా 225 మంది కరోనా బారినపడ్డారు. తర్వాత స్ధానాల్లో చిత్తరు జిల్లాలో 187 కేసులు విశాఖపట్నంలో 167, కృష్ణాజిల్లాలో 135 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో కూడా 84 కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద కొద్దో గొప్పో కేసులు ప్రతి జిల్లాలోను నమోదవ్వటమే యంత్రాంగాన్ని టెన్షన్ లోకి నెట్టేస్తోంది. మొత్తంమీద మళ్ళీ తొందరలోనే రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించేట్లే ఉంది.