మా నాయ‌కుడికి టైం క‌లిసి రావ‌డం లేదు

ఔను! ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇదే మాట వినిపిస్తోంది. “మా నాయ‌కుడికి టైం క‌లిసి రావ‌డం లేదు”.. -ఇదే మాట సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు వినిపిస్తోం ది. వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో వైసీపీ నేత‌లు ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నారు. ఓ వైపు.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం న‌మోదు చేశాం.. ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని నాయ‌కులు మురిసిపోతూ.. తాము చేయాల‌ని అనుకున్న ప‌నుల‌ను ఒక్కొక్కటిగా.. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందుగానే పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.. కానీ.. ఇప్పుడు ఒక్కొక్క ప‌ని కూడా వెన‌క్కి జ‌రుగుతోంది.

మూడు రాజ‌ధానులు
సీఎం జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన మూడు రాజ‌ధానుల ఏర్పాటు అంశం ఈ ఏడాదిలో ఎట్టి ప‌రిస్థితిలోనూ పూర్తి చేసి తీరాల‌ని నాయ‌కులు భావించారు.. ముఖ్యంగా జ‌గ‌న్ కూడా ఈ విష‌యంలో అన్నీ రెడీ చేసుకున్నారు. మే 6 నాటికి ఎట్టి ప‌రిస్థితిలోనూ రాజ‌ధానిని విశాఖ‌కు త‌ర‌లించాల‌ని అనుకున్నారు. దీనికి ప్ర‌తిప‌క్షాల నుంచి ఎలాంటి అడ్డు లేకుండా స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాన్ని తెర‌మీదికి తెచ్చారు. మా మూడు ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌జ‌లు జై కొట్టార‌ని ఇప్ప‌టికే నాయ‌కులు ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇంత‌లోనే.. హైకో ర్టు మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ‌కు రెడీ అయింది. ఇది వైసీపీకి శ‌రాఘాతంగా మారింది. అంటే.. ఈ రోజు వారి విచార‌ణ ఎప్ప‌టికి పూర్త‌వుతుందో ఎవ‌రూ చెప్ప ‌లేని ప‌రిస్తితి. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు సాగుతుంద‌ని అంటున్నారు.

ప్ర‌త్యేక హోదా:
ఏదో ఒక ర‌కంగా కేంద్రాన్ని ఒప్పించి.. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించాల‌ని జ‌గ‌న్ భావించారు. ప్లీజ్‌.. ప్లీజ్ .. అంటూనే దీనిని సాధిస్తామ‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో కేంద్రానికి అన్ని విధాలాఆయ‌న స‌హ‌క‌రిస్తున్నారు. కానీ, కేంద్రం మాత్రం హోదా ఇచ్చేది లేద‌ని ప‌దే ప‌దే పార్ల‌మెంటులోనే కుండ‌బ‌ద్ద‌లు కొడుతోంది. ఇది జ‌గ‌న్ కు తీవ్ర సంక‌టంగా మారింది.

విశాఖ ఉక్కు:
పోరాడి సాధించుకున్న ఆంధ్రుల హ‌క్కు.. విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని.. ప్రైవేటీక‌రిస్తామ‌ని ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం ఆదిశ‌గా వేస్తున్న అడుగులు జ‌గ‌న్‌ను మ‌రింత ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. చేసేది చేస్తున్న కేంద్రం మ‌ధ్య‌లో త‌న‌పేరును, త‌న ప్ర‌భుత్వాన్ని తెర‌మీద‌కి తెస్తుండ‌డంతో జ‌గ‌న్ న‌లిగిపోతున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని సీఎం జ‌గ‌న్‌కు చెప్పే చేస్తున్నామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. అంతేకాదు… తాజాగా మ‌హారాష్ట్ర‌కు చెందిన బీజేపీ నాయ‌కుడు మ‌రో బాంబు పేల్చారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై సీఎం జ‌గ‌న్ సంత‌కం ఉంద‌న్నారు. అయితే.. దీనికి సంబంధించిన డాక్యుమెంటు ఏదీ ఆయ‌న బ‌య‌ట పెట్ట‌క‌పోయినా.. రేపో మాపో.. దీనిని కూడా బ‌య‌ట‌కు తెచ్చేలా బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇది జ‌గ‌న్ విశ్వ‌స‌నీయ‌త‌పై పెద్ద దుమార‌మే రేప‌నుంది.

జిల్లాల ఏర్పాటు:
వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ క‌ల‌ల ప్రాజెక్టుల్లో ఇది కీల‌కం. రాష్ట్రంలో ప్ర‌తిపార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాన‌ని పాద‌యాత్ర స‌మయంలోనే ఆయ‌న ఊరించారు. అయితే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్ర‌తిపాద‌న ముందుకు సాగ‌లేదు. పైగా నిన్న మొన్న‌టి వ‌రకు జిల్లాల ఏర్పాటుకు స‌హ‌క‌రిస్తామ‌న్న కేంద్రం.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంది. జనాభా లెక్కలు పూర్తయ్యే వరకూ జిల్లా, మండల, గ్రామ రెవెన్యూ పరిధిలో మార్పులు చేయొద్దని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు పూర్తయ్యేవరకూ జిల్లాల ఏర్పాటుకు బ్రేక్ పడింది. కరోనా కారణంగా తాత్కాలికంగా జనగణన నిలిపివేశారు. దీంతో ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏడాదిన్నర పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పోల‌వ‌రం:
ఏపీ ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడు పూర్త‌వుతుందా? అని ఎదురు చూస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌రిస్థితి మ‌రో నాలుగు అడుగులు వెన‌క్కి వెళ్లింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు స‌వ‌రించిన అంచ‌నాల‌కు కేంద్రం జైకొట్టేందుకు రెడీగా ఉంద‌ని.. తాము ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశామ‌ని చెప్పుకొచ్చిన జ‌గ‌న్ స‌ర్కారుకు కేంద్రం… త‌న వ‌ద్ద అలాంటి ప్ర‌తిపాద‌న లేద‌ని పార్ల‌మెంటులో తాజాగా స్ప‌ష్టం చేసేసింది. దీంతో 2014 నాటి అంచ‌నాల మేరకే పోల‌వ‌రానికి నిధులు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో పోల‌వ‌రం ముందుకు సాగ‌డం క‌ష్ట‌మేన‌ని రాష్ట్ర ఇంజ‌నీర్లు చెబుతున్నారు.

అప్పులు:
జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న అప్పులు దేశంలోని ఇత‌ర ఏ రాష్ట్రం కూడా చేయ‌డం లేద‌ని ఇటీవ‌ల కాగ్ స్ప‌ష్టం చేసింది. దేశంలో అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వ‌రుస‌లో నిలిచింది. మున్ముందు అప్పులు పుట్టే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్ప‌టికే ఆదాయం లేక‌, పెట్టుబ‌డులు రాక‌.. అల్లాడుతున్న ఏపీకి ఇది మ‌రింత ఇర‌కాట‌మైన ప‌రిస్థితి.