ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగ ఏర్పాటు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. కనీసం మరో ఏడాదిపాటు కొత్త జిల్లాల ఏర్పాటుకు నిరీక్షణ తప్పేట్లులేదు. దీనికి కారణం ఏమిటంటే భారత రిజిస్ట్రార్ కార్యాలయం జారీచేసిన నిబంధనలే. దేశవ్యాప్తంగా జనగణన జరిగేంతవరకు ఇపుడున్న జిల్లాల భౌతిక సరిహద్దులు మార్చవద్దని రిజిస్ట్రార్ కార్యాలయం దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
నిజానికి జనగణన దాదాపు ఏడాది క్రిందటే మొదవ్వాల్సింది. అయితే కరోనా వైరస్ కారణంగా పనులు మొదలుకాలేదు. ఈ ఏడాదిలో మొదలుపెడదామని అనుకుంటే మళ్ళీ ఇపుడు కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ అంటున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇపుడు కూడా జనగణన ప్రక్రియ మొదలయ్యేట్లులేదు.
మరి ఈ సమస్య ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు జనగణన మొదలవుతుందో ఎవరు చెప్పలేకున్నారు. అంతవరకు జిల్లాల సరిహద్దులను మార్చటంకానీ, జిల్లాలను రద్దు చేయటంకాని చేయవద్దని, జిల్లాల పరిపాలనా పరిధిని మార్చవద్దని, కొత్త సబ్ డివిజన్ల ఏర్పాటు వద్దని లాంటి అనేక సూచనలు, నిబంధనలతో తాజాగా ఓ సర్క్యులర్ జారీచేసింది.
సో తాజాగా జారీఅయిన సర్క్యులర్ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో జరిగే వ్యవహారం కాదని తేలిపోయింది. జగన్ మాత్రం 13 జిల్లాలను 26 లేదా 27 జిల్లాలు చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ప్రతి జిల్లాను రెండుగా విభజించాలని అనుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని ప్రస్తుత అరకు పార్లమెంటు నియోజకవర్గం బాగా పెద్దది కావటంతో దీన్ని మాత్రం రెండు జిల్లాలుగా చేయాలనే ప్రతిపాదనుంది. ఎందుకైనా మంచిదిని ముందుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ప్రకటించారు. చివరకు ఇది రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందేమో చూడాలి.