ఏపీ సీన్ రివ‌ర్స్‌.. హీటెక్కిస్తున్న‌ కేసీఆర్ కామెంట్లు

ఈ విష‌యంపై చ‌ర్చించే ముందు.. కొంచెం లోతుగా ప‌రిశీలించాల్సి.. ఈ క్ర‌మంలో అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితికి.. కొన్నాళ్ల కింద‌ట‌కి ఏం జ‌రిగిందో చూద్దాం..
రెండేళ్ల కింద‌ట‌:
హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌లు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌తో గుంటూరు, విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, విశాఖ హోట‌ళ్లు కిట‌కిట‌లాడాయి. ఎక్క‌డ చూసినా.. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. ఎవ‌రిని క‌దిలించినా.. మా భూమికి మంచి ధ‌ర వ‌చ్చిందండి! అనే మాట త‌ప్ప‌.. మేం న‌ష్ట‌పోయాం అనే మాటే లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఏర్ప‌డ‌డం.. దీనికి సంబంధించిన అంచ‌నాలు జోరుగా ప్ర‌చారం కావ‌డం. ప్ర‌పంచ స్థాయి సామ‌ర్థ్యం.. ఉన్న కంపెనీలు ఇక్క‌డ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావ‌డ‌మే. దీంతో తెలంగాణ‌లోని భూముల ధ‌ర‌ల‌తో పోలిస్తే.. ఏపీలో భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు తొడిగాయి. అక్క‌డ నాలుగు ఎక‌రాలు అమ్మితే.. ఏపీలొ ఒక ఎక‌రం కొనే ప‌రిస్థితి!!

ఇప్పుడు:
తెలంగాణ అసెంబ్లీలోనే కేసీఆర్ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఏపీలో సీన్ రివ‌ర్స్ అయింది. ఒక‌ప్పుడు ఇక్క‌డ నాలుగు ఎక‌రాలు అమ్మితే.. ప్ర‌కాశం జిల్లాలో ఒక ఎక‌రం కొన‌డం క‌ష్ట‌మ‌య్యేది. కానీ.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల కార‌ణంగా.. ఇక్క‌డ భూముల‌కు రెక్క‌లు వ‌స్తున్నాయి. ఏపీ ప‌ని రివ‌ర్స్ అయింది. ఇక్క‌డ ఎక‌రం అమ్మితే.. అక్క‌డ నాలుగు ఎక‌రాలు కొనొచ్చు!!

అస‌లు సంగ‌తి!!
కేసీఆర్ కామెంట్ల‌ను తేలిక‌గా తీసుకునే ప‌నిలేదు. చాలా వ్యూహాత్మ‌కంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. కేవ‌లం ఆయ‌న భూముల‌ను రియ‌ల్ ఎస్టేట్‌ను మాత్ర‌మే పోల్చి చెప్పిన మాట‌లు కావు అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఎం జ‌గ‌న్ ప‌నితీరుతో ఏపీ ప‌రిస్థితి అప్పుల పాలు అయిపోయింద‌ని.. ఇప్ప‌టికే ఆర్థిక వ‌ర్గాల నుంచి విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ‌ధాని విష‌యం కూడా గంద‌ర‌గోళంలో ప‌డ‌డంతో రియ‌ల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బ‌తిని.. భూముల ధ‌ర‌లు అమాంతం ప‌డిపోయాయి. ఫ‌లితంగా భ‌వ‌న నిర్మాణ రంగం మ‌రింత‌గా అగాధంలోకి ప‌డిపోయింది.

ఇక‌, ఎక్క‌డా పెట్టుబ‌డుటలు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. సో.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశాజ‌న‌మైన రాష్ట్రం.. పెట్టుబ‌డుల ప‌రంగా.. పాల‌న ప‌రంగా అభివృద్ధిలో ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే! అనే కీల‌క సందేశాన్ని.. ప్ర‌చారాన్ని క‌ల్పించేందుకు కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా జ‌గ‌న్ లోపాల‌ను, ఏపీ ప‌రిస్థితిని చెప్ప‌క‌నే అసెంబ్లీలో చెప్పార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.