తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కడం ద్వారా పార్టీలో నెలకొన్న నైరాశ్యాన్ని పారదోలాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే.. వీటి నుంచి వెంటనే కోలుకున్న పార్టీ అధిష్టానం.. ఓటమికి దారితీసిన పరిస్థితులపై యుద్ధ ప్రాతిప దికన చర్చించి.. వెంటనే వ్యూహాలకు రెడీ అయింది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ఆయా ఎన్నికల్లో విజయం దక్కించుకోవడానికి వలంటీర్ వ్యవస్థను దొడ్డిదారిలో వినియోగించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ.. ప్రజలను మోటివేట్ చేయడంలోను.. ఓటు వేసేలా పోలింగ్ కేంద్రాలకు వారిని నడిపించడంలోను కూడా కీలక పాత్ర పోషించారు.
అయితే.. ఈ తరహా ప్రయత్నాలు.. టీడీపీలో జరగలేదు. నాయకులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నప్పటికీ.. ప్రజలను నేరుగా కలిసి.. పార్టి వైపు మళ్లించే ప్రయత్నాలు చేయలేదు. నిజానికి కొన్ని నెలల కొందటే.. పార్టీకి బలమైన నాయకులను వివిధ పదవుల్లో నియమించారు. పార్టీ పార్లమెంటరీ పదవులు క్రియేట్ చేసి.. కీలక నేతలకు అప్పగించారు. ఇక, మండల స్థాయి నేతలను కూడా నియమించారు. అయితే.. వాళ్లు మాత్రం పైపైనే ప్రచారం చేశారు.. తప్ప.. ప్రజలనే నేరుగా కలిసి.. ముఖ్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించలేదు. దీంతో వైసీపీ వలంటీర్ల వ్యవస్థను సమగ్రంగా వినియోగించుకుని ఎన్నికల్లో సంపూర్ణ లబ్ధి పొందింది. దీనిపై కూలంకషంగా చర్చించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తిరుపతిపై దాదాపు ఇలాంటి వ్యూహమే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీకి ఉన్న సీబీఎన్(చంద్రబాబు నాయుడు) ఆర్మీని ఇప్పుడు తిరుపతిలో దింపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. .. జగన్ వ్యూహానికి ప్రతివ్యూహం వేయాలని భావించిన బాబు.. ఇప్పుడు సీబీఎన్ ఆర్మీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారిలో కీలకమైన వారిని ఎంపిక చేసి తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో 50 కుటుంబాలకు ఒక్కరు చొప్పున బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఒకవైపు నాయకులు రోడ్ చేసి.. ప్రచారం చేస్తుండగా.. వీరు మాత్రం ఇంటింటికీ తిరుగుతూ.. టీడీపీని ఎందుకు గెలిపించాల్సిన అవసరం ఉందో వివరిస్తారు. అంతేకాదు.. ఓట్లు లేనివారికి ఒటు హక్కు కల్పించేలా కూడా ప్రయత్నిస్తారు. మొత్తానికి ఈ వ్యూహానికి ఒకటి రెండు రోజుల్లోనే తుది రూపు ఇస్తారని.. తెలుస్తోంది.