షర్మిల ధీమానే వేరు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల నోటి నుంచి వస్తున్న మాటలు అందరిని ఆకర్షించేలా ఉంటున్నాయి. ప్రజాజీవితంలోకి రావాలనుకునే వారు.. ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్న విషయాన్ని ఆమెను చూసి నేర్చుకోవాలన్న మాట వినిపిస్తోంది. పార్టీని పెడతానని చెప్పిన రోజు నుంచి.. ప్రతి రోజు ఏదోఒక కార్యక్రమాన్ని నిర్వహించటం.. తాను చెప్పాల్సిన మాటల్ని చెప్పటం కనిపిస్తుంది. అంతేకాదు.. వారంలో ఒకరోజు అయినా పార్టీకి సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్య ఒకటి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వచ్చే నెల 9నఖమ్మంలో బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్న ఆమె.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నివిషయాల్ని ఒకేసారి చెప్పకుండా.. వ్యూహాత్మకంగా ఒక్కొక్క విషయాన్ని ఒక్కో రోజున.. వివిధ వేదికల మీద మాట్లాడటం ద్వారా.. తమ పార్టీకి సంబంధించిన విషయాల్ని కొత్తగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా కీలక వ్యాఖ్య చేశారు.

రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలోని ఏ పార్టీతోనూ తాము పొత్తులు పెట్టుకునేది లేదని.. సొంతంగానే పోటీ చేస్తామన్నారు. టీఆర్ఎస్ అడిగితేనో.. బీజేపీ పంపితేనో తాను తెలంగాణకు రాలేదన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. రాజన్న సంక్షే పాలనను మళ్లీ తీసుకురావటమే తన లక్ష్యంగా చెబుతున్న ఆమె.. ఖమ్మం జిల్లా ఉమ్మడి నేతలతో భేటీ అయ్యారు. తాజాగా నిర్వహించే సభకు సంకల్ప సభ పేరుతో పోస్టర్ ను విడుదల చేశారు.

తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసేందుకు తానెందుకు సంకల్పం తీసుకున్నది తాను ఏప్రిల్ 9న జరిగే సభలో వివరిస్తానంటూ ఆసక్తిని పెంచారు. ప్రతి రోజు పార్టీకి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం ఉండేలా.. ఏదో ఒక జిల్లాకు చెందిన వారితో.. ఏదైనా వర్గానికి చెందిన వారినో కలుసుకోవటం.. భారీ బజ్ కు ముందు అవసరమైన గ్రౌండ్ ను ప్రిపేర్ చేసుకునే ధోరణి షర్మిల మాటల్లోనూ.. చేతల్లోనూ కనిపిస్తుందని చెప్పాలి. ఆమెను లెక్కలోకి వేసుకోవాల్సిన అవసరం లేదన్న వారికి తగిన షాక్ ఇచ్చేలా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్న మాట మరింత ఆసక్తికరంగా మారింది. మరేం చేస్తారో చూడాలి.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)