వైఎస్. షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ సెగలు రేపుతోంది. ఇటు అన్న ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటే అటు షర్మిల మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో పార్టీ పెట్టి ఏం చేస్తారు ? అన్నది చాలా ఆసక్తిగా ఉంది. కొత్త పార్టీ ఏర్పాట్లలో ఉన్న షర్మిల… ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ నుండి తన పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఆమె కొత్త పార్టీ ప్రకటన మీదే ఉంది. ఇప్పటికే ఆమె ఉమ్మడి జిల్లాల వారీగా వైఎస్ కుటుంబ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
షర్మిల కొత్త పార్టీ పెట్టకుండానే ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లాపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు లేదా కొత్తగూడెం నుంచి పోటీచేసే ఛాన్సులు ఉన్నాయన్న ప్రచారం కూడా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఆమె సంచలన ప్రకటన చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి తాను ఎన్నికల బరిలో ఉంటానన్నారు. వైఎస్ కు పులివెందుల ఎలాగో… తనకు పాలేరు అంత సెంటిమెంట్ అని, తమ ప్రభంజనాన్ని ప్రత్యర్థి పార్టీలు తట్టుకోలేరంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
షర్మిల చేసిన ఈ ప్రకటనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుబులు రేపుతోంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్‌లోనే రెండు గ్రూపులు ఉన్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇప్పుడు ఈ నియోజకవర్గమే దిక్కుగా ఉంది. 2016లో ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన ఆ తర్వాత ముందస్తు సాధారణ ఎన్నికలలో అనామకుడు అయిన కందాళ ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కందాళ ఆ తర్వాత కారెక్కేయడంతో ఇప్పుడు నియోజకవర్గ టీఆర్ఎస్‌లో తుమ్మల, కందాళ గ్రూపుల గోల ఉంది. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాళ కారెక్కేయడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు నాథుడే లేకుండా పోయాడు.
అక్కడ టీడీపీకి ఇన్‌చార్జ్‌గా మద్దినేని స్వర్ణకుమారి ఉన్నా ఆ పార్టీకి సంస్థాగతంగా బలం ఉన్నా కనుమరుగైపోయింది. ఈ లెక్కన చూస్తే షర్మిల అక్కడ టీఆర్ఎస్‌నే ప్రధానంగా ఎదుర్కోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీలో బలమైన నేతగా ఉన్న తుమ్మల తనకు ఫస్ట్ టార్గెట్ అని ఆమె చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం కందాళ హవాతో సొంత పార్టీలోనే ఇబ్బంది పడుతోన్న తుమ్మల కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తనదే పాలేరు టిక్కెట్ అన్న ధీమాతో ఉన్నారు. ఇప్పుడు షర్మిల తన పోటీ అక్కడే అని చెప్పడంతో ఆయనకు చివరి పరీక్షగా పెద్ద అగ్నిపరీక్ష ఎదురుకానుంది.. దీనిని ఎలా ఎదుర్కొంటారో ? ఈ లోగా సమీకరణలు ఎలా ? మారతాయో ? చూడాలి.