ఆంధ్ర్రప్రదేశ్ నూతన ఎన్నికల కమిషనర్ వ్యవహారం మరోసారి ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తేటతెల్లం చేస్తోందని అంటున్నారు పరి శీలకులు. ప్రస్తుతమున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి కాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ ఎంపిక ప్రక్రియను సీఎం జగన్ ప్రారంబించారు. ఇప్పటికే ఆయన ఈ పదవి కోసం.. ముగ్గురి పేర్లతో కూడిన నివేదికను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించారు.గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే.. ఏప్రిల్ 1వ తారీకు నుంచి కొత్తవారు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక, తాజాగా జగన్ చేసిన సిఫారసులను గమనిస్తే.. ఇటీవలే ప్రబుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిటైర్ అయిన.. సీనియర్ ఐఏఎస్ అదికారి నీలం సాహ్ని, అదేవిధంగా మాజీ ఐఏఎస్‌లు ప్రేమ్ చంద్రారెడ్డి, శామ్యూల్ ఉన్నారు. వీరిలో జగన్ తన సామాజిక వర్గానికి చెందిన ప్రేమ్ చంద్రారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారని.. రాజకీయ వర్గాల నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. అయితే.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో ఒక మహిళ, ఒక ఓసీ, ఒక ఎస్సీ వర్గాలకు చెందిన వారి పేర్లను జగన్ సిఫార్సు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, గవర్నర్ తీసుకునే నిర్ణయం.. పూర్తిగా సీఎం సూచించిన వారి వైపే ఉంటుందని కూడా చెబుతున్నారు.
ఇదే కనుక వాస్తవ రూపం దాలిస్తే..ప్రేమ్ చంద్రారెడ్డి పేరు ఖరారు కానుంది. ప్రస్తుతం రాష్ట్రం పంచాయతీ, నగర, పురపాలక సంఘాలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినా.. ఇంకా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి ఇప్పుడున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోనే వీటిని పూర్తి చేయించాలని జగన్ సర్కారు భావించినా.. సాధ్యంకాలేదు. దీంతో కొత్తగా వచ్చేవారు ఈ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక, ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్.. మరో ట్విస్ట్ ఇవ్వడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
గత ఏడాది కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను అర్ధంతరంగా నిలుపుదల చేశారనే అక్కసుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక ఆర్డినెన్స్‌తో పక్కన పెడుతూ.. ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించారు. ఈ క్రమంలో ఆఘమేఘాలపై తమిళనాడు నుంచి మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను తీసుకువచ్చి.. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా కరోనా సమయంలోనే బాధ్యతలుచేపట్టేలా చేశారు. అయితే.. ఈ నియామకాన్ని హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కొట్టివేయడంతో ఆయన తప్పుకొన్నారు.
అయితే.. ఇప్పుడు నిజానికి జగన్‌కు కనగరాజ్‌కు ఇవ్వాలని ఉండి ఉంటే.. తాజాగా చేసిన సిఫారసులో ఖచ్చితంగా ఆయన పేరు ఉండేదని.. కానీ, అప్పట్లో కేవలం రాజకీయ కారణాల నేపథ్యంలోనే కనగరాజ్‌ను వాడుకున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయనపై ప్రేమ ఉండి ఉంటే.. ఖచ్చితంగా ఇప్పుడు సిఫారసు చేసిన పేర్లలో కనగరాజ్‌పేరు కూడా ఉండేదని.. కానీ.. నాడు ఎన్నికలకు ముందు తన సొంత సోదరిని.. తర్వాత నిమ్మగడ్డతో వైరం సందర్భంగా.. కనగరాజ్‌ను వాడుకుని వదిలేశారని విమర్శల జోరు అందుకోవడం గమనార్హం.