బీజేపీ పరిస్ధితేంటో ఇక్కడే అర్ధమైపోయిందా ?

గెలిచేస్తామని, పొడిచేస్తామని ఎప్పటినుండో రచ్చ రచ్చ చేస్తున్న బీజేపీ పరిస్దితి ఏమిటో ఇక్కడే అర్ధమైపోయింది. తొందరలోనే జరగబోయే తిరుపతి లోక్ సభ ఉనఎన్నికకు పార్టీలు రంగంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ చాలా రోజుల క్రితమే పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించేసిన విషయం తెలిసిందే. ఈమధ్యనే వైసీపీ కూడా డాక్టర్ గురుమూర్తిని అభ్యర్ధిగా ప్రకటించింది. బీజేపీ కూడా ప్రకటించేసింది కానీ అభ్యర్ధిని కాదు ప్రచార కమిటిని.

అవును మీరు చదివింది కరెక్టే. ప్రధాన రెండు పార్టీలు అభ్యర్ధులను ప్రకటిస్తే బీజేపీ మాత్రం ప్రచార కమిటిని ప్రకటించటమే విచిత్రం. అభ్యర్ధిని ప్రకటించకుండా ప్రచారకమిటిని ఎందుకు ప్రకటించిందో పార్టీ చీఫ్ సోమువీర్రాజుకే తెలియాలి. పైగా ఉపఎన్నికలో తామే పోటీ చేస్తామని వీర్రాజు ఎప్పటినుండో ప్రకటిస్తున్నారు. దానికి తగ్గట్లే గతంలోనే ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. పోటీలో తమ అభ్యర్ధే ఉంటారని తెలిసినపుడు మరి అభ్యర్ధిని ఎందుకు రెడీ చేసుకోలేదో అర్ధం కావటంలేదు.

మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారకమిటిని పనిచేస్తుందట. అలాగే నియోజకవర్గాల్లో ఇన్చార్జులుగా సోము వీర్రాజు, టీజీ వెంకటేష్, సుజనా చౌధరి, పురంధేశ్వరి, సునీల్ థియోధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, బైరెడ్డి, ఐవైఆర్, రావెల కిషోర్ బాబును పార్టీ ప్రకటించింది. వీరిలో టీజీ, కన్నా తప్ప మిగిలిన వాళ్ళల్లో చాలామందికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలే లేవు. రావెల ఒకసారి ఏదో గాలిలో గెలిచారంతే. ఇక సుజనా, జీవిఎల్, ఐవైఆర్ కైతే ప్రజా జీవితంతో సంబంధమే లేదు.

పురంధేశ్వరి కాంగ్రెస్ జమానాలో రెండుసార్లు గెలిచారు. మళ్ళీ గెలవలేదు. అంటే అప్పట్లో ఆమె గెలుపు పార్టీ గెలుపే కానీ ఆమె సొంతబలం కాదని తేలిపోయింది. వీర్రాజు ప్రజా జీవితం కూడా అంతంతమాత్రమే. ఇలాంటి నేతలను పెట్టుకుని బీజేపీ ఉపఎన్నికలో గెలిచేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా ? అన్నదే ప్రశ్న. అయినా ప్రచార కమిటిని నియమించే ముందే అభ్యర్ధిని ప్రకటించాలని వీర్రాజుకు తెలీదా ?