నోటికి వచ్చినట్లుగా మాట్లాడి చులకన కావటం కొందరు ముఖ్యమంత్రులకు బాగా అలవాటు. ఇటీవల కాలంలో అవసరం ఉన్నా లేకున్నా.. ఏదో విషయాన్ని కెలికి వార్తల్లోకి రావటమే కాదు.. అందరి చేత మాట అనిపించుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఉత్తరాఖండ్ బీజేపీ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ ముందు ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆయనకు ఏమైందో కానీ.. ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వార్తాంశాలుగా మారి.. బీజేపీ పరువురు బజారులో పెడుతున్నాయి.
మహిళలు చిరిగిపోయిన జీన్స్ వేసుకునే విధానంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసి.. అతివల ఆగ్రహానికి గురైన ఆయన.. తాజాగా తన జీకే (జనరల్ నాలెడ్జ్) ఎంతో చెప్పే ప్రయత్నం చేశారు తాజా వ్యాఖ్యలతో. కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా పడుతున్న ఇబ్బందిని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో భారత్ గొప్పతనం.. ప్రధాని మోడీ సమర్థతనుచాటి చెప్పాలన్న తొందరలో తప్పులో కాలేశారు.
భారత్ ను అమెరికా 200 ఏళ్లు పాలించిందని.. ప్రపంచాన్నే పాలించిన అమెరికా ఇప్పుడు కొవిడ్ నియంత్రణకు తీవ్రంగా శ్రిమిస్తుందన్నారు. కోవిడ్ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ చాలా మెరుగ్గా ఉందన్నారు. ‘భారతీయుల్ని 200 ఏళ్ల పాటు బానిసలుగా చేసిన అమెరికా కూడా కొవిడ్ ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ మళ్లీ లాక్ డౌన్ విధించే పరిస్థితి ఉంది. భారత్ లో మోడీ స్థానంలో మరొకరు ఉండి ఉంటే పరిస్థితులు ఘోరంగా ఉండేవి’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. కరోనా నుంచి ప్రతి ఒక్కరినీ మోడీ కాపాడారన్న ముఖ్యమంత్రి మాటలు ఇప్పుడు నవ్వులు పూయించేలా మారాయి. మోడీ ఘనతను కీర్తించేందుకు ఆయన కలిపిన పులిహోర దెబ్బకు కమలనాథులు కిందా మీదా పడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates