నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలకు ముహూర్తం రెడీ అయిన వేళ.. అన్ని పార్టీలూ కూడా ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలపై ఉచితాల వర్షం కురిపిస్తున్నాయి. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ ప్రకటించడమే! అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు ప్రకటిస్తున్నా మ్యానిఫెస్టోలు హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడులో ప్రజలకు ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అని చాలా వరకు ఉచితంగా వస్తువులు అందిస్తామని ప్రధాన పార్టీలు హామీ ఇచ్చాయి. తమిళనాడులో ఆల్ ఫ్రీ నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.
అదే విధంగా కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్‌లో కూడా పార్టీలు తమ మ్యానిఫెస్టోలో హామీలు కురిపించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన హామీలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉంది. టీఎంసీ తరఫున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఇటీవల విడుదల చేశారు. అందులో అనేక హామీలు ఇవ్వగా.. వాటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న ‘ఇంటింటికి రేషన్ బియ్యం’ కార్యక్రమం మాదిరి పశ్చిమ బెంగాల్‌లో కూడా అమలుచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు.
‘బంగ్లా శోబర్.. నిశ్చిత్ ఆహార్’లో భాగంగా ‘రాష్ట్రంలోని 1.5 కోట్ల రేషన్ కార్డుదారులందరూ ఇకపై చౌకధరల దుకాణానికి వెళ్లనవసరం లేదు.’ అని మేనిఫెస్టోలో తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఏపీలో సీఎం జగన్ జనవరి 21వ తేదీన ‘ఇంటింటికి రేషన్’ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీని ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. మార్చి 25వ తేదీన ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. అనంతరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఢిల్లీ అంతటా అమలు చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates