చిన్నారెడ్డి సంచలనం.. ఎన్నికల్లో పోటీ చేయరట

హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్నారెడ్డి.. అనుకున్న దాని కంటే దారుణంగా ఓటమిపాలయ్యారు. ఆయనకు వచ్చిన ఓట్లు కూడా చాలా తక్కువగా పోల్ అయ్యాయి. 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. నాలుగో స్థానంలో ఆయన నిలిచారు.

నీతిగా.. నిజాయితీగా.. మచ్చలేని రాజకీయ నాయకుడిగా ఆయనకు పేరుంది. అలాంటి ఆయన చిత్తుచిత్తుగా ఓడిపోయిన వైనం ఆయనకే అర్థం కావట్లేదు.
ఓటమి కన్ఫర్మ్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన చిన్నారెడ్డి.. సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు.గతంలో మాదిరి పరిస్థితులు లేవని.. తాను పాతతరం నాయకుడ్ని అని చెప్పుకున్న ఆయన.. ఇప్పుడు ఎన్నికల తీరు పూర్తిగా మారిపోయిందన్నారు.

తనలా వ్యవహరించే జానారెడ్డికి మారిన పరిస్థితుల గురించి ముందే చెబుతానని.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతానన్నారు. తన తాజా ఎన్నికల అనుభవాన్ని జానారెడ్డితో పంచుకుంటానని చెప్పిన ఆయన.. పట్టభద్రులు సైతం ఓటును రూ.2వేలకు అమ్ముకోవటం బాధ కలిగించినట్లు చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని యువత ఎంతో ఆశపడ్డారని.. ఖాళీగా ఉన్న 1.91లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయలేదని.. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల్ని కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 26 నెలలు అయినా ఇప్పటివరకు వాస్తవరూపం దాల్చలేదన్నారు.

అయినప్పటికీ యువత.. పట్టభద్రుల ఓటర్లు మరిచిఓటువేయటం బాధ కలిగించిందన్నారు. డబ్బుతోనూ.. .మద్యంతోనూ ఓటర్లను మభ్యపెట్టే తీరును ప్రదర్శిస్తారని.. అలాంటి ధోరణి మారాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి మారాలే కానీ.. ఇప్పటికే మారిన పరిస్థితులు మారే అవకావమే లేదన్న చేదు నిజాన్ని ఈ సీనియర్ కాంగ్రెస్ నేత గుర్తిస్తే మంచిది.