ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సోమవారం నాటి సభ వేదికగా మారుతుందని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ బడ్జెట్ మీద మాట్లాడనున్నారు. అదే సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తాను చేయాలనుకున్నపలు ప్రకటనల్ని అప్పుడే చేస్తారని చెబుతున్నారు. దీనికి తోడు.. అప్పటికి రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన పీఆర్సీలకు సంబంధించిన ఫిట్ మెంట్ శాతాన్ని ప్రకటించటంతో పాటు.. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు.. సంక్షేమ హాస్టల్స్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునే వీలుందని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లు బంద్ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో.. విద్యార్థుల్ని వచ్చే సంవత్సరానికి ఎలా ప్రమోట్ చేయాలన్న అంశంపైనా స్పష్టత ఇచ్చేస్తారని చెబుతున్నారు.
మరి.. పీఆర్సీ పై ప్రభుత్వం ప్రకటన చేస్తే.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోడ్ కు ఉల్లంఘించినట్లు కాదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదని చెబుతున్నారు. సాగర్ ఉప ఎన్నిక కోడ్ నల్గొండ జిల్లా పరిధిలో మాత్రమే అమల్లో ఉంటుందని.. రాష్ట్రం మొత్తానికి అమల్లో ఉండదని.. అందుకే.. ప్రభుత్వం చేసే ప్రకటనలకు అడ్డంకి కాదన్న మాటను అధికారులు చెబుతున్నారు. ఏమైనా.. మరో మూడు రోజుల్లో కేసీఆర్ నోట కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates