తిరుపతి ఉపఎన్నికలో ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 25వ తేదీనుండి అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి గెలుపుకు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నేతలంతా ప్రచారంలోకి దిగాలంటూ దిశానిర్దేశం చేశారు. మొన్నటి ఎన్నికలో దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటి 2.28 లక్షలు. అప్పటి మెజారిటికి మించి రాబోయే ఎన్నికల్లో రావాలని స్పష్టం చేశారు. అంటే ప్రచారంలో లేదుకానీ సుమారు 5 లక్షల మెజారిటి తగ్గకూడదని జగన్ గట్టిగా చెప్పారని సమాచారం.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రి+ఒక బయటప్రాంతం ఎంఎల్ఏ బాధ్యులుగా ఉంటారని జగన్ చెప్పారు. స్ధానిక ఎంఎల్ఏకి అదనంగా పై ఇద్దరు పర్యవేక్షకులుగా ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎన్నికలు అయిపోయేంత వరకు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని కూడా స్పష్టంగా చెప్పారు. వెంటనే రంగంలోకి దిగేయాలని మంత్రులకు జగన్ ఆదేశాలు కూడా ఇచ్చేశారు.
తిరుపతికి పేర్నినాని, శ్రీకాళహస్తికి కన్నబాబు, సత్యవేడుకు కొడాలి నాని, గూడూరుకు అనీల్ కుమార్, సూళ్ళూరుపేట మేకపాటి గౌతమ్ రెడ్డి, వెంకటగిరి బాలినేని శ్రీనివాసరెడ్డి, సర్వేపల్లి ఆదిమూలపు సురేష్ బాధ్యులుగా నియమితులయ్యారు. వీరికి అదనంగా స్ధానికంగా ఉండే ఎంఎల్ఏలు ఎటూ ఉంటారు. కాబట్టి ప్రచారం, ఎలక్షనీరింగ్ చాలా పక్కగా ఉండాలన్నారు. పంచాయితి, మున్సిపాలిటిల్లో వైసీపీ అఖండ విజయం సాధించిందనే ఏమరుపాటు వద్దని గట్టిగానే హెచ్చరించారు. దీంతోనే తిరుపతి ఉపఎన్నికను జగన్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమైపోతోంది.
మొత్తానికి ఇటు వైసీపీ అటు టీడీపీలు గెలుపుకోసం పార్టీల తరపున కమిటీలను వేసుకుని రంగంలోకి దాదాపు దిగేసినట్లే. వైసీపీ తరపున డాక్టర్ ప్రచారంలోకి దిగేశారు. ఇక టీడీపీ తరపున పనబాక ఎప్పటినుండి ప్రచారంలోకి దిగుతారో చూడాలి. ఎందుకంటే చంద్రబాబునాయుడు ఎంతచెప్పినా పనబాక అభ్యర్ధిత్వంపై ఇంకా పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ తరపున పోటీచేసేది ఎవరో తేలలేదు. కాంగ్రెస్, వామపక్షాలను ఎవరు పట్టించుకోవటం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates