బెంగాల్ బీజేపీలో ట్విస్ట్

సరిగ్గా ఎన్నికల ముందు పశ్చిమబెంగాల్లో ముసలం మొదలైంది. ఇంతకాలం మమతాబెనర్జీని ఓడిస్తామని, అధికారంలోకి వచ్చేస్తామని చెబుతున్న పార్టీ అగ్రనేతలకు తాజాగా మొదలైన గొడవలు పెద్ద షాక్ ఇచ్చాయి. బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడతలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను పార్టీ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా గొడవలు మొదలైపోయాయి.

సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేస్తున్న తమను కాదని తృణమూల్ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి ఫిరాయించిన వారికి టికెట్లు ఇచ్చారంటూ సీనియర్ నేతలు మండిపోయారు. హుగ్లీ, హపడా, ఆలీపూరార్, ఉత్తర, థక్షిణ పరగణాలు, కూచ్ బీహార్ జిల్లాల్లోని మొత్తం 20 నియోజకవర్గాల్లో సీనియర్ల భగ్గుమన్నారు. పార్టీ కార్యాలయాల ముందు గొడవకు దిగారు. పార్టీ కార్యాలయాల్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేయటమే కాకుండా కొన్నిచోట్ల కార్యాలయాలను కూడా మంటలకు ఆహుతిచ్చారు.

పార్టీ అధిష్టానంపై పార్టీ సినియర్ నేతలు+స్ధానిక నేతల్లో ఇంతటి తిరుగుబాటు జరుగుతుందని ఢిల్లీలోని అగ్రనేతలు ఏమాత్రం ఊహించలేదు. దాంతో అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా పరిగెత్తుకుంటు బెంగాల్ చేరుకున్నారు. తమకు టికెట్లు నిరాకరించినందుకు నిరసనగా తమ నియోజకవర్గాల్లో వాళ్ళంతా నామినేషన్లు వేశారు. దాంతో క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలోని నేతలను పిలిచి మాట్లాడాలని అమిత్ ఆదేశించారు. అయితే తిరుగుబాటు నేతలెవరు సమావేశానికి హాజరుకాలేదు.

ఇదిలాగుంటే రెండో విడతలో పోటీచయబోయే 148 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. రెండో జాబితా దెబ్బ మరింతగా పడింది. అసంతృప్తులు ఎక్కడికక్కడ ఒకటై పార్టీ ఆఫీసులను తగలబెట్టేశారు. శుక్రవారం బెంగాల్ మీడియా మొత్తం ఇదే దృశ్యాలను చూపించాయంటే పరిస్ధితి ఎంత ఉద్రిక్తంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.  విచిత్రమేమంటే బీజేపీ అభ్యర్ధులను తామే ఓడిస్తామంటు తిరుగుబాటు నేతలు ఎక్కడికక్కడ పోటీ నామినేషన్లు వేశారు.

వీళ్ళ ఒత్తిడిని తట్టుకోలేని అగ్రనేతలు కొన్నిచోట్ల అప్పటికప్పుడు అభ్యర్ధులను మార్చారు. అయితే కొన్ని చోట్ల పెద్ద పొరబాట్లు జరిగిపోయాయి. బీజేపీ నేతలను అభ్యర్ధులుగా ప్రకటించాల్సిన అగ్రనేతలు కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలకు టికెట్లు ప్రకటించేశారు. దాంతో అగ్రనేతల చర్యలు పార్టీ పరువును తీసేశాయి. తమకు బీజేపీ టికెట్లివ్వటం ఏమిటంటు కాంగ్రెస్ నేతలు భగ్గుమనటంతో అసలు విషయం బయటపడింది. దాంతో పార్టీ పరువంతా పోయింది. మొత్తం మీద పార్టీలో మొదలవ్వబోయే ముసలాన్ని గమనించకుండా మమత వెంటపడితే ఇలాగే ఉంటుంది పర్యవసానాలని అనుకుంటున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)