ఏప్రిల్ 17వ తేదీన జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ప్రత్యర్ధులకు వైసీపీ సవాలు విసిరింది. ఇంతకాలం అనధికారికంగా ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తినే అధికారికంగా తమ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తేలాల్సింది బీజేపీ అభ్యర్ధి మాత్రమే. కాంగ్రెస్ తరపున కూడా ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది.
ఉపఎన్నికలో ఎంతమంది నామినేషన్లు వేసినా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ-టీడీపీ మధ్య మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారు. దాదాపు ఐదునెలల క్రితమే పనబాకను తమ అభ్యర్ధిగా చంద్రబాబునాయుడు ప్రకటించినా ఆమె ఇంతవరకు యాక్టివ్ కాలేదు. అసలామె పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే ఏకపక్షంగా తన పేరును చంద్రబాబు ప్రకటించేశారని పనబాక బాగా అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.
ఎంతమంది నేతలు ఆమెను ప్రచారానికి రమ్మని పిలిచినా ఇప్పటివరకు ఆమె ప్రచారానికి దిగలేదు. ఒకసారి కరోనా వైరస్ అని తర్వాత తన కూతురు వివాహం అని కారణాలు చెప్పారు. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ప్రచారానికి రాకపోవటంతోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు ఈమధ్యనే వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత పనబాక వెనకాడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది.
తిరుపతి లోక్ సభ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్ళఊరుపేట నియోజకవర్గాలున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి ఉన్నాయి. వీటిల్లో సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి మున్సిపాలిటిలు, తిరుపతి కార్పొరేషన్లను వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ప్రజల నాడిచూసిన తర్వాత పనబాక ఇపుడు పోటీకి వెనకాడుతున్నట్లు సమాచారం. సరే బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని కూడా జనాలు పట్టించుకోవటం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates