ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బీజేపీ పెద్ద షాకే ఇచ్చింది. డీఎంకే ఎంఎల్ఏ శరవణన్ బీజేపీలో చేరారు. మధురై జిల్లాలోని తిరుపుప్పరన్ కుండ్రమ్ నియోజకవర్గానికి శరవణన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ ఎంఎల్ఏ చేరికతో బీజేపీలో చేరిన డీఎంకే ఎంఎల్ఏల సంఖ్య రెండుకు చేరింది. గతంలోనే సెల్వమ్ అనే ఎంఎల్ఏ కమలం కండువా కప్పుకున్నారు.
నిజానికి డీఎంకే నుండి ఇద్దరు ఎంఎల్ఏలు బయటకు వచ్చేసి బీజేపీలో చేరటాన్ని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ దశాబ్దాలుగా చేయని ప్రయత్నంలేదు. అయినా ఇప్పటివరకు ఒక్క నేత కూడా ఎంఎల్ఏగానీ లేకపోతే ఎంపిగా కానీ గెలవలేకపోయారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో డీఎంకేనే అధికారంలోకి రాబోతోందని సర్వేలు చెబుతున్నాయి.
అన్నీ విషయాలు తెలిసి కూడా ఇద్దరు డీఎంకే ఎంఎల్ఏలు బీజేపీలో ఎందుకు చేరారో ఎవరికీ అర్ధం కావటంలేదు. అన్నాడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ 20 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది. అన్నాడీఎంకేనే ఓడిపోతోందంటే ఇక మిత్రపక్షమైన బీజేపీకి ఎవరు ఓట్లేస్తారు ? ఇంతచిన్న విషయం తెలీక కాదు ఇద్దరు ఎంఎల్ఏలు బీజేపీలో చేరింది. బహుశా వాళ్ళద్దరికి స్టాలిన్ టికెట్లు ఇవ్వటానికి నిరాకరించారా ? అనే సందేహం పెరిగిపోతోంది.
సరే పార్టీ మారిన శరవణన్ పార్టీలో అంతర్గత వివాదాల వల్లే తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు. పార్టీ మారిన తర్వాత ప్రతి నేత చేసే ఆరోపణలే ఇవి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు డీఎంకేకి రాజీనామా చేసిన శరవణన్ ఒకపుడు బీజేపీ నేతే. అయితే ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్న ఉద్దేశ్యంతోనే డీఎంకేలో చేరి ఎంఎల్ఏ అయ్యారు. అలాంటిది ఇపుడు మళ్ళీ డీఎంకేకి రాజీనామా చేసి బీజేపీలోకి రీఎంట్రీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates