తాడిప‌త్రి, మైదుకూరు కూడా వైసీపీకే.. ఎలాగంటే..!

రాష్ట్ర వ్యాప్తంగా మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసి.. జోరుమీదున్న వైసీపీకి పంటికింద రాయిలా.. కంట్లో న‌లుసులా.. రెండు మునిసిపాలిటీలు మారాయి. వీటిలో అనంత‌పురం జిల్లాలోని తాడిప‌త్రి, క‌డ‌ప జిల్లాలోని మైదుకూరు. ఈ రెండు చోట్ల కూడా టీడీపీ అభ్య‌ర్థులు మెజారిటీ సాధించారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ వైసీపీ ప్ర‌స్తుతం ప‌రాజ‌యం పాలైంది. అయితే.. ఇక్క‌డ కూడా.. త‌మ ఖ‌తా తెరుస్తామ‌ని.. వీటిని కూడా త‌మ బుట్ట‌లో వేసుకుంటామ‌ని.. వైసీపీ నాయ‌కులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. సాంకేతికంగా చూస్తే.. ఇది వైసీపీకి సాధ్య‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. వైసీపీ ద‌గ్గ‌ర ఎక్స్ అఫీషియో.. ఓట్ల బ్యాంకు ఉండ‌డ‌మే.

తాడిప‌త్రి విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి రంగంలోకి దిగి.. టీడీపీ త‌ర‌ఫున త‌న వారిని నిల‌బెట్టారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కి.. మునిసిప‌ల్ చైర్మ‌న్ గిరిని సొంతం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే హోరా హోరీ సాగిన పోరులో .. జేసీ వ‌ర్గం.. ఆశించిన విధంగానే దూకుడు చూపించింది. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వీటిలో వైసీపీ 16 చోట్ల విజ‌యం సాధించింద‌. ఇక‌, టీడీపీ ఇక్క‌డ 18 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంది. స్వ‌తంత్ర అభ్య‌ర్థులు ఇద్ద‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. మునిసిప‌ల్‌లో పార్టీ పాగా వేయాలంటే.. 19 మంది అభ్య‌ర్థుల మ‌ద్ద‌తు అవ‌స‌రం.

ఈ క్ర‌మంలో వైసీపీ త‌న‌కున్న ఎక్స్ అఫిషియో.. ఓట్లు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఓట్ల‌ను వినియోగించుకుని.. మ‌రో స్వ‌తంత్ర అభ్య‌ర్థిని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇది సాధ్యం అయ్యే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. ఇదే జ‌రిగితే.. జేసీ వ‌ర్గం చేసిన కృషి మ‌ట్టిపాల‌వడం ఖాయ‌మ‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో మైదుకూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌.. టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ముందుకు సాగాయి. టీడీపీ త‌ర‌ఫున పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నించారు.

ఇక్క‌డ మొత్తం.. 24 వార్డులు ఉన్నాయి. వీటిలో వైసీపీ 11, టీడీపీ 12, ఇత‌రులు ఒక చోట విజ‌యం ద‌క్కించుకున్నారు. సాంకేతికంగా చూస్తే.. టీడీపీ గెలిచిన‌ట్టు అనిపించినా.. ఇక్కడ కూడా ఎక్స్ అఫిషియో .. ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయి. మైదుకూరు ఎమ్మెల్యే , రాజంపేట ఎంపీలు ఇద్ద‌రూ కూడా వైసీపీ నేత‌లే క‌నుక‌.. ఇక్క‌డ కూడా వైసీపీనే పాగా వేస్తుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇలా చూస్తే.. మొత్తంగా టీడీపీ జీరో కావ‌డం గ‌మ‌నార్హం.