తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మూడు రాజధానులకు ఆమోదం తెలిపినట్లే భావించాలి. విజయవాడ, గుంటూరులో ప్రచారం చేసినపుడు అమరావతి సెంటిమెంటును కాపాడుకోవాలంటే టీడీపీకే ఓట్లేయాలని చంద్రబాబునాయుడు జనాలను ఆదేశించారు. మామూలుగా అయితే ఓట్లేయండని అభ్యర్ధిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం విచిత్రంగా విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో జనాలను బాగా తిట్టిపోశారు.
టీడీపీకి ఎందుకు ఓట్లేయరో చెప్పాలన్నారు. సిగ్గులేదా శరం లేదా రోషం లేదా పౌరుషం లేదా అంటు నోటికొచ్చినట్లు మాట్లాడారు. వైసీపీకి ఓట్లేస్తే రాజధానిని అమరావతి నుండి తరలించటానికి అంగీకారం తెలిపినట్లవుతుందని లాజిక్ లేవదీశారు. చంద్రబాబు ఏమి చెప్పినా జనాలు మాత్రం వైసీపీనే గెలిపించారు. అలాగే విజయవాడ కార్పొరేషన్లో కూడా వైసీపీదే విజయం.
అంటే రాజధానిని అమరావతి నుండి తరలించటానికి చంద్రబాబు భాషలోనే జనాలు ఆమోదం తెలిపినట్లు అనుకోవాలి. కార్పొరేషన్లు సరే కనీసం రాజధాని జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటిలో కూడా టీడీపీని గెలిపించలేదు. ఇదే సమయంలో కర్నూలు, వైజాగ్ కార్పొరేషన్లలో కూడా వైసీపీనే ఘన విజయం సాధించింది. దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు జనాలు ఆమోదం లభించినట్లే అనుకోవాలి.
అయితే ఇప్పటికే మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉంది కాబట్టి సాంకేతికంగా తరలించేందుకు లేదు. కానీ జగన్ మాత్రం వైజాగ్ వెళ్ళిపోవటం ఖాయమని తేలిపోయింది. తొందరలోనే జగన్ అమరావతిని వదిలిపెట్టేసి వైజాగ్ వెళ్ళిపోవటానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నైతికంగా మద్దతుగా నిలిచిందనే అనుకోవాలి. కాబట్టి జగన్ వైజాగ్ వెళ్ళటానికి ఇక ఎంతో కాలం పట్టదు. అప్పుడు చంద్రబాబు అండ్ కో నోరెత్తటానికి కూడా లేదు. ఎందుకంటే రాజదాని తరలింపును చంద్రబాబే రెఫరెండంగా అభివర్ణించారు కాబట్టి.