వైసీపీలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ ఎంపీలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్నారు. పార్టీలో కీలకంగా చక్రం తిప్పే ఎంపీలకు సైతం ఈ అసమ్మతి తప్పడం లేదు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విజయసాయి, మంత్రి అవంతి, జిల్లా ఎమ్మెల్యేలు పూర్తిగా డమ్మీలను చేసేశారన్న చర్చ ఉంది. ఆయన కూడా ఏదో ఎంపీగా ఉండడం మినహా చేసేదేం లేదు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు కోల్డ్ వార్ తీవ్రమైంది.
ఇక గోదావరిలో అందరూ ఎమ్మెల్యేలకు అసమ్మతి తప్పడం లేదు. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు పడట్లేదు. గీత కన్ను పిఠాపురం మీద ఉండడమే కారణమంటున్నారు. అమలాపురం ఎంపీ చింతా అనూరాథకు మంత్రి విశ్వరూప్‌తోనూ, మరో మంత్రి చెల్లుబోయిన వేణుతోనూ, రాజోలు వైసీపీ నేతలతోనూ పొసగట్లేదు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌కు ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు తీవ్రమైన యుద్ధం నడుస్తోంది. ఆ మాటకు వస్తే ఎంపీ భరత్‌తో మరి కొందరు నేతలకు కూడా పడట్లేదు.
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీథర్‌కు మంత్రి ఆళ్ల నానితో గ్యాప్ ఉందంటున్నారు. ఇటు శ్రీథర్ సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలీజా సైతం శ్రీథర్‌కు వ్యతిరేకంగా గ్రూప్ నడుపుతున్నారు. నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఏకంగా పార్టీలోనే పెద్ద అసమ్మతి నేత అయిపోయారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌కు ఆయన పార్లమెంటు పరిధిలోని పలువురు పార్టీ నేతలతోనే కాకుండా ఇటు ఆయనకు సంబంధం లేకపోయినా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితోనూ తకరారు నడుస్తోంది.
నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులకు ఆయన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు విడదల రజనీ, కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడుతో సఖ్యత లేదు. ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంటకు మంత్రి బాలినేనికి గ్యాప్ ఉంది. అటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌కు ఎమ్మెల్యేలతో పొసగక పోయినా ఆయన వ్యాపారాలు చేసుకుంటూ నెల్లూరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కడప, రాజంపేట ఇద్దరు ఎంపీలు స్ట్రాంగ్‌గానే ఉన్నా వీరికి జగన్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంతో తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా పొసగట్లేదు. ఉన్నంతలో కర్నూలు జిల్లా ఎంపీలతో పాటు బందరు, విజయనగరం, అరకు ఎంపీలే కాస్త వివాదాలకు దూరంగా ఉంటోన్న పరిస్థితి ఉంది.