పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆమె నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఐతే ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా నెలకొంది. తనపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటూ మమత ఆరోపించడం చర్చనీయాంశం అయింది.
ఆమె కార్లో సొమ్మసిల్లి పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఐతే ఒక ముఖ్యమంత్రి మీద ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు దాడి చేయడమేంటి అన్న ప్రశ్న తలెత్తింది. అలా జరుగుతుంటే చుట్టూ ఉన్న రక్షణ సిబ్బంది ఏం చేస్తున్నారన్నది సందేహం. దాడికి సంబంధించిన దృశ్యాలేవీ కూడా బయటికి రాకపోవడం గమనార్హం.
మమతపై దాడి ఉదంతంపై సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా సానుకూల వ్యాఖ్యలు వినిపించలేదు. ఇదో పెద్ద డ్రామా అన్నట్లుగానే చూశారు నెటిజన్లు. దీని వెనుక మమత ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ ఉండి ఉండొచ్చనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల ముంగిట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడి కత్తి దాడి వ్యవహారం తెరపైకి వచ్చింది. అప్పుడు అధికార పార్టీనే ఆ దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు ఈ కేసులో తేల్చిందేమీ లేదు. జగన్‌పై దాడి జరిపిన వ్యక్తి స్వేచ్ఛగా తిరిగేశాడు. పైగా రాజకీయాల్లోకి వచ్చి ఇటీవలే పదవి కూడా అందుకున్నాడు. ఈ దాడి మొత్తం జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ స్కెచ్ అనే అనుమానాలు అప్పుడు వ్యక్తమయ్యాయి.
రాను రాను అవి మరింత బలపడ్డాయి. ఇప్పుడు మమతపై దాడి వ్యవహారాన్ని కోడికత్తి ఎపిసోడ్‌తో పోలుస్తూ వైకాపా వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు. రెండు ఘటనల్ని పోల్చు చూపుతూ ఇది కచ్చితంగా డ్రామానే అని, ప్రశాంత్ కిషోర్ దీని వెనుక ఉన్నాడని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉత్తరాది జనాలు సైతం ఇదే తరహాలో స్పందిస్తున్నారు. ప్రశాంత్ సహకారం అందుకున్న అరవింద్ కేజ్రీవాల్ మీద కూడా ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడి ఉదంతాన్ని కూడా దీంతో పోలుస్తుండటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates