ప్రజలను ఇంకా మభ్య పెడుతున్నారా ?

‘విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్రానికి అన్యాయమైతే జరగదు’ ఇది తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఒకవైపు విశాఖ స్టీలు ఫ్యాక్టరీని 100 శాతం ప్రైవేటీకరిచటం ఖాయమని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించారు. కేంద్రమంత్రి ఇంత స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా సజ్జల ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం కావటంలేదు.

ఎన్దీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలను ఏమాత్రం లెక్క చేయటంలేదు. ఓ పద్దతి ప్రకారం రాష్ట్రానికి అన్యాయం చేయటంలో ఏమాత్రం వెనకాడటంలేదు. ఇందుకు నాలుగు కారణాలున్నాయి. మొదటిదేమో రాష్ట్రప్రయోజనాలను కాపాడుకునే విషయంలో రాజకీయ పార్టీల్లో సఖ్యత లేకపోవటం. అంటే తమిళనాడులోని రాజకీయపార్టీల్లో ఉన్నట్లు ఐకమత్యం లేకపోవటం. రెండో కారణం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలనే చిత్తశుద్ది పార్టీల్లో లేకపోవటం.

ఇక మూడోది జనాల్లో స్పందన కనబడకపోవటం. తమిళనాడులో జల్లికట్టును నిషేధించినపుడు జనాల్లో ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో అందరు చూసిందే. ప్రజల్లో వ్యతిరేకత చూసిన తర్వాత దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. తమ సంస్కృతిని లేదా తమ రాష్ట్రంలోని ఫ్యాక్టరీలను కాపాడుకునే విషయంలో అక్కడి జనాలు చూపే తెగువ మన జనాల్లో కాగడాపెట్టి వెదికినా కనబడదు.

ఫైనల్ గా నాలుగో కారణం బీజేపీకి రాష్ట్రంతో ఎలాంటి బాండేజీ లేకపోవటం. ఎలాగంటే రాష్ట్రంలో బీజేపీ తరపున ఒక్క ఎంపిగానీ లేదా ఎంఎల్ఏగానీ లేరు. పోనీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తారా అంటే అదీలేదు. కాబట్టి రాష్ట్రప్రయోజనాలను కాపాడినా పార్టీ తరపున ఒక్క నేత కూడా ఎక్కడా గెలిచేంత సీన్ లేనపుడు ఇంకెందుకు పట్టించుకోవాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ పట్టించుకోవటంలేదు.

ఈ విషయాలు కళ్ళకు స్పష్టంగా కనబడుతున్నా ప్రభుత్వం మాత్రం ఇంకా ఎందుకు జనాలను మభ్య పెట్టాలని చూస్తోందో అర్ధం కావటంలేదు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలేమిటో ఎవరికీ తెలీదు. అసలు ప్రయత్నాలు చేస్తున్నారో లేదో కూడా అర్ధం కావటంలేదు. ఇటువంటి పరిస్దితుల్లో ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా జగన్ కాపాడుతారని సజ్జల చెబితే ఎలా నమ్ముతారు ? కాబట్టి మభ్య పెట్టడం మానేసి వాస్తవాలు చెబితే జనాలు మానసికంగా ప్రిపేర్ అవుతారు.