ఏపీలో మళ్లీ సైకిల్ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని.. ఏపీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కనుక, పైగా ఆర్థిక లోటులో ఉంది కనుక.. ప్రజలు సైకిల్ వైపే మొగ్గు చూపుతున్నారంటూ.. 2019 ఎన్నికల సమయంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ఒపీనియన్ పోల్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే.. మళ్లీ ఏపీలో చంద్రబాబు కొద్దిగా మెజారిటీ తగ్గినా.. తిరిగి అధికారంలోకి వస్తారని చెప్పారు. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అసెంబ్లీలోకి అడుగు పెడతారని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన ఒపీనియన్ పోల్ పూర్తిగా ఫెయిల్ అయింది.
దరిమిలా.. తాను ఇక, ఎన్నికల ఫలితాలపై ప్రకటించనని.. చెప్పిన రాజగోపాల్.. దాదాపు రెండేళ్లుగా మౌనం గా ఉన్నారు. అయితే. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలను నేరుగా ఉటంకించకుండానే.. ఆయన కొన్ని కామెంట్లు చేశారు. సీఎం వైఎస్ జగన్‌తో తనకు చాలా అనుబంధం ఉందని రాజగోపాల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు… రాజకీయాలకు ముందు నుంచి కూడా తనకు-జగన్‌కు మధ్య స్నేహం ఉందన్నారు.
అంతేకాదు.. ముఖ్యమంత్రి కావాలన్న.. జగన్ ఆకాంక్ష నెరవేరిందని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. అయితే.. జగన్ పాలన చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ… తాను జగన్ పాలనపై ఎలాంటి వ్యాక్యలు చేయలేనని లగడపాటి పరోక్షంగా చెప్పుకోవడం గమనార్హం. మరో మూడేళ్ల పాలన తర్వాతే జగన్ పాలన ఎలా ఉందో తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా మారాయి. కొసమెరుపు ఏంటంటే.. రాజగోపాల్ తన తనయుడు.. ప్రణయ్‌ను త్వరలోనే రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారనే వార్తలు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే. ఏ పార్టీలో ఆయన చేరతారు.. అనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో సీఎం జగన్‌కు అనుకూలంగా రాజగోపాల్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిని బట్టి.. రాజగోపాల్ తన తనయుడిని వైసీపీలోకి చేరుస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates