ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేశాయి. దాదాపు 32 మంది ప్రాణత్యాగాలతో ఏళ్లతరబడి పోరాటాల నేపథ్యంలో ఏర్పడిన ఈ కర్మాగారాన్ని నష్టాల పేరుతో.. అమ్మేయడాన్ని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో నిరసిస్తున్నారు.
ఇక, ఈ ఉద్యమ సెగ రాష్ట్ర ప్రభుత్వానికి బాగానే తాకింది. కేంద్రం చేస్తున్న దూకుడు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేక పోతోందని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరో వైపు.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నీ చెప్పే చేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కారుకు విశాఖ ఉక్కు సెగబాగానే తగులుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రదాని మోడీకి ఒక లేఖరాసి న సీఎం జగన్.. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ కోరారు. అదేసమయంలో దీనిని కాపాడుకునేందుకు ఉన్న అవకాశాల ను కూడా ఆయన అప్పటి లేఖలో వివరించారు.
అయినప్పటికీ.. కేంద్రం దీనిపై ముందుకే వెళ్తున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో పాటు.. వంద శాతం ప్రైవేటీ కరిస్తామని.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో విశాఖ ప్రస్తుతం అట్టుడుగుతోంది. ఈ పరిణామాలు జరగనున్న ఎన్నికలపై కూడా ప్రభావం చూపించేలా ఉన్నాయని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఎం జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
వెనువెంటనే ఆయన మళ్లీ కేంద్రానికి లేఖ రాశారు. మరోసారి.. గతంలో చెప్పిన విషయాలను ఉటంకిస్తూనే.. లేఖలో ప్రధానిని వేడుకున్నారు. అయితే.. ఈ లేఖలో మరో కొత్త విషయం ఏంటంటే.. ప్రధాని నరేంద్ర మోడీని సీఎం జగన్ అప్పాయింట్ మెంట్ కోరడం. అది కూడా తాను, తనతోపాటు.. కార్మిక సంఘాల నాయకులు.. రాజకీయ పక్షాల నేతలను తీసుకువస్తానని.. అప్పాయింట్మెంట్ ఇవ్వాలని తాజాగా రాసిన నాలుగు పేజీల లేఖలో సీఎం జగన్ .. ప్రధాని మోడీని విన్నవించారు.
దీని ప్రకారం.. జగన్కు రేపు మోడీ కనుక అప్పాయింట్మెంట్ ఇస్తే.. రాష్ట్రంలో ప్రధాన పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కూడా వెంటబెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇతర పార్టీలతో అంటీముట్టనట్టు వ్యవహరించిన జగన్.. ఇప్పుడు విశాఖ ఉక్కు విషయంలో మాత్రం వారిని తీసుకువస్తానని.. అప్పాయింట్మెంట్ ఇవ్వాలని కోరడం గమనార్హం. ఇక, ఇప్పుడు ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పిలుపును అందుకుని.. ఢిల్లీ వెళ్లి.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యంగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? అనేది ఆసక్తిగా ఉంది. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ వెంట ఢిల్లీ వెళ్లి.. మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గళం వినిపించగలరా? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ ఇద్దరికీ కూడా విశాఖ రాజకీయపరంగా చూసుకుంటే.. ఇక్కడి ప్రజల మనోభావాలు చాలా ముఖ్యం.
కానీ.. రాజకీయ పార్టీల పరంగా చూసుకుంటే.. జనసేనాని బీజేపీతొ ఇప్పటికే పొత్తులో ఉన్నారు. ఇక, చంద్రబాబు వచ్చే ఎన్నికల్ల అవకాశం వస్తే.. బీజేపీతో జట్టుకట్టేందుకు రెడీ అవుతున్నారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అందునా.. సీఎం జగన్ వెంట నడిచి.. ఢిల్లీ వెళ్తారా? అనేది ఉత్కంఠగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.