ఈ మాజీ ఎంఎల్ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఇలాగే ఉంటుంది. దెందులూరు మాజీ ఎంఎల్ఏ, తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. ఏలూరు కార్పొరేషన్ 23వ డివిజన్లో చింతమనేని జనసేన పార్టీ అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు. ఏలూరులోని టీడీపీ సీనియర్ నేతలు తమ పార్టీ అభ్యర్ధుల తరపున మాత్రమే ప్రచారం చేస్తుంటే చింతమనేని మాత్రం జనసేనకు ప్రచారం చేయటం కలకలం సృష్టిస్తోంది.
ఇంతకీ విషయం ఏమిటంటే ఏలూరు కార్పొరేషన్లోని 23వ డివిజన్లో టీడీపీ తరపున ఓ నేత నామినేషన్ వేశారు. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దాంతో ఈ వార్డులో టీడీపీ తరపున అభ్యర్ధి లేకుండాపోయారు. ఇదే విషయం టీడీపీ సీనియర్ నేతల్లో చర్చకు వచ్చింది. చేయగలిగేదేమీ లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయారు.
అయితే చింతమనేని మాత్రం ఊరుకోలేదు. తమ పార్టీ అభ్యర్ధి ఎలాగు లేరు కాబట్టి, వైసీపీకి డివిజన్ను వదిలేయటం ఇష్టంలేకపోయింది. అందుకనే పోటీలో ఉన్న జనసన అభ్యర్ధి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చింతమనేనే చెప్పుకున్నారు. టీడీపీ అభ్యర్ది లేరు కాబట్టి జనసేన నేతలను వెంటేసుకుని ప్రచారంలో తిరుగుతున్నట్లు చెప్పారు.
నిజానికి అనధికారికంగా తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మున్సిపాల్ వార్డుల్లో టీడీపీ+జనసేన నేతలు కలిసే ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవలే ముగిసిన పంచాయితి ఎన్నికల్లో కూడా కొన్నిచోట్ల టీడీపీ, జనసేనలు కలిసే పనిచేశాయి. కొన్ని పంచాయితిలు, వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలిచారంటే అందుకు టీడీపీ మద్దతివ్వటమే కారణం. అప్పట్లో అనధికారికంగా జరిగిన సహకారం ఏలూరు కార్పొరేషన్లో బహిరంగంగానే జరుగుతోందంతే.
Gulte Telugu Telugu Political and Movie News Updates