సౌత్ వారు తెగ తాగేస్తున్నారట

ఉత్తరాది.. దక్షిణాది అంటూ తరచూ వినిపించే వాదనల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన ఒక ఆసక్తికర నివేదిక ఒకటి బయటకు వచ్చింది. క్రిసిల్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నార్త్ తో పోలిస్తే సౌత్ లోనే మద్య వినియోగం ఎక్కువని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా చూస్తే.. మద్య వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్న వైనం బయటకు వచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో.. ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటివేళలో దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు తక్కువేనని చెబుతున్నారు. దీనికి కారణం మద్యం అమ్మకాల కారణంగా వచ్చే ఆదాయమని చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా వినియోగించే మద్యంలో 45 శాతం దక్షిణాది రాష్ట్రాల వారే వినియోగిస్తారన్న చేదు నిజం బయటకు వచ్చింది. సౌత్ లోని ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో మద్య వినియోగం ఎక్కువేనని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. అంతేకాదు.. ఆయా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పది నుంచి పదిహేను శాతం వరకూ మద్యం అమ్మకాల ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నట్లు చెప్పింది.

ఆ మధ్య వచ్చిన ఒక సినిమాలో మందు తాగే వారిని తాగుబోతులంటూ చీప్ గా మాట్లాడకూడదని.. చులకనగా చూడకూడదని.. తమను ట్యాక్స్ పేయర్స్ గా గౌరవించాలని చెప్పటం గుర్తుండే ఉంటుంది. నిత్యం.. ఏ మాత్రం క్రమం తప్పకుండా టాక్స్ పే చేసే ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మందుబాబులేనన్న మాటలు.. తాజా రిపోర్టులోని అంశాల్ని చూస్తే గుర్తుకు రాక మానదు.