నారాయ‌ణ‌.. నారాయ‌ణ‌.. కాషాయం గూటికి క‌మ్యూనిస్టు..!

ఠాఠ్‌!! రాముడు లేడు.. రామాయణం లేదు.. అదో పుక్కిటి పురాణం.. అని ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌చారం చేసే ప‌రిశుద్ధ క‌మ్యూనిస్టు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌ను త‌న వ్యాఖ్య‌ల ద్వారా.. కుదిపేసే.. సీపీఐ నేత‌ నారాయ‌ణ‌.. ఉర‌ఫ్ చికెన్ నారాయ‌ణ‌.. తాజాగా మ‌ఠాల బాట ప‌ట్టారు. అది కూడా నిన్న మొన్న‌నే.. త‌న మాట‌ల తూటాల‌ను పేల్చి.. తీవ్ర వివాదం సృష్టించిన విశాఖ‌లోని శార‌దా పీఠానికి ఆయ‌న వెళ్ల‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశంగాను, సంచ‌ల‌నంగాను మారింది. సీపీఐ కీల‌క నాయ‌కుడు విశాఖలో స్వరూపానందను కలిశారు. జీవీఎంసీ 97వ వార్డు సీపీఐ అభ్యర్థి యశోద తరపున ప్రచారం చేస్తూ స్వరూపనందను నారాయణ క‌ల‌వ‌డం రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

“మిమ్మల్ని కలిసిన వారందరీని గెలిపిస్తారంట కదా.. మా అభ్యర్థిని కూడా గెలిపించాలి” అని స్వరూపనందను నారాయణ కోరారు. స్వరూపానందను నారాయణ కలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖను సీపీఐ తరపును పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా నారాయణ ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే స్వరూపానందను నారాయణ కలిశారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన 97వ వార్డులో ప్రచారం చేశారు. అయితే ఇదే వార్డులో స్వరూపనందస్వామి మఠం ఉండడంతో తమ అభ్యర్థిని గెలిపించాలని స్వామిని కోరారు. ఈ సందర్భంగా నారాయణకు స్వామి శాలువా కప్పి ఆశీస్సులు కూడా ఇచ్చారు.

అక్కడ కొద్దిసేపు నారాయణ, స్వామితో మాట్లాడారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రచారంలో భాగంగా మఠానికి వెళ్లామని, అయితే ఈయన ఆశీస్సులు తీసుకుంటే గెలుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని, అందువల్ల ఆశీస్సులు సీపీఐ అభ్యర్థికి ఇవ్వాలని స్వామిని అభ్యర్థించామని నారాయణ తెలిపారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని నారాయణ వివరణ ఇచ్చారు. కానీ, ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌.. డీజీపీ స‌వాంగ్‌, ఆర్టీసీ ఎండీ ఠాగూర్‌లు వ‌రుస‌గా స్వామి స్వ‌రూపానంద‌ను క‌ల‌వ‌డాన్ని ఇదే నారాయ‌ణ త‌ప్పుబ‌ట్టారు. ఆయ‌నే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఆయ‌న కాషాయం తీసేసి.. జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పుకోవాల‌ని అన్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఆయ‌నే వెళ్లి స్వామికి సాష్టాంగం ప‌డ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో ఇలానే గాంధీ పుట్టిన రోజునాడు.. చికెన్ తిని.. ఏడాది పాటు ప్రాయ‌శ్చిత్తం కింద‌.. చికెన్ ముట్ట‌న‌ని శ‌ప‌థం చేశారు. మ‌రి ఇప్పుడు క‌మ్యూనిస్టుల సిద్ధాంతం ప్ర‌కారం .. త‌ప్ప‌ని తేలితే.. ఎలాంటి ప్రాయ‌శ్చిత్తం చేసుకుంటారో చూడాలి.