బెజ‌వాడ‌లో ఆ రెండు సామాజిక వ‌ర్గాలు ఎటు వైపు..?

అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌.. త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల కాలంలో దాదాపు అన్ని సామాజిక వ‌ర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర‌వ‌ర్ణాల్లో ఈ ఆవేద‌న ఎక్కువ‌గా ఉంది. పైగా వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాలు ఈ విష‌యంలో మ‌రింత బాధ‌ప‌డుతున్నాయి. బెజ‌వాడ‌లో ఈ రెండు సామాజిక వ‌ర్గాలు ఎక్కువ‌. సెంట్ర‌ల్‌లో బ్రాహ్మ‌ణ‌, ప‌శ్చిమ‌లో వైశ్య‌లు ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌స్తుతం కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వీరు ఎవ‌రి వైపు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌నే ప్ర‌శ్న తెర‌మీద‌కి వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల విష‌యాన్ని తీసుకుంటే.. ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు.. ఎమ్మెల్యేగా ఉన్నారు. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బ్రాహ్మ‌ణ ఓట్ల కోసం ప్ర‌య‌త్నించిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకున్న దాఖ‌లా లేద‌నే వాద‌న వినిపిస్తోంది. పైగా బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ కూడా నిర్వీర్యం అయింద‌ని.. ఏ ఒక్క రూపాయి కూడా త‌మ‌కు అంద‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, వైశ్య సామాజిక వ‌ర్గం విష‌యానికి వ‌స్తే.. ‌దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్ఇదే సామాజిక వ‌ర్గం. పైగా ఆయ‌న గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైశ్య వ‌ర్గానికి అనేక హామీలు ఇచ్చారు. కానీ.. ఈయ‌న మంత్రి అయిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు వైశ్యుల‌తో ఆత్మీయ స‌మావేశం కూడా నిర్వ‌హించ‌లేక పోయారు. ఎక్క‌డ భేటీ అయితే.. వారి స‌మ‌స్య‌లు మ‌ళ్లీ ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు అటు మ‌ల్లాదికి, ఇటు వెలంప‌ల్లికి చెల్లింది. కానీ, ఇప్పుడు విజ‌యవాడ కార్పొరేష‌న్‌లో వీరిద్ద‌రూ స‌త్త‌చూపించాలంటే..బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న‌ వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల‌ను మ‌చ్చిక చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. స‌త్య‌నారాయ‌ణ పురం, మ‌ధురాన‌గ‌ర్‌, దేవీన‌గ‌ర్, అయోధ్య‌న‌గ‌ర్‌ వంటి కీల‌క ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మ‌ణుల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల్సిన అవ‌స‌రం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని వైశ్యుల‌ను త‌న‌కు మ‌ద్ద‌తుగా మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వీరిని ఎలా క‌లుస్తారు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనికి రెండు ప్ర‌ధాన అవ‌రోధాలు క‌నిపిస్తున్నాయి. గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు..బ్రాహ్మ‌ణుల‌కు మ‌ల్లాది విష్ణు అనేక హామీలు ఇచ్చారు. అవేవీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేదు. ఇక‌, మంత్రి వెలంప‌ల్లి.. దేవ‌దాయ శాఖ‌లోని బ్రాహ్మ‌ణుల‌ను వ‌దిలేసి..ఇత‌ర రాజ‌కీయాలు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో వైశ్యుల‌ను రాజ‌కీయంగా విడ‌దీశార‌నే వ్యాఖ్య‌లు కూడా వెలంప‌ల్లి విష‌యంలో వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కార్పొరేష‌న్ కైవ‌సం చేసుకోవ‌డం ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.