వ‌లంటీర్ల‌పై ‘ఓట‌మి’ కొర‌డా..

ఏ ఎన్నిక‌ల్లో అయినా.. పార్టీ నేత‌లు ఓడిపోతే.. లేదా పార్టీ ఓడిపోతే.. ఎవ‌రు బాధ్యులు..? పార్టీలో ఉన్న‌వారు బాధ్యులు.. లేదా.. స‌ల‌హాదారులు.. ప‌రిశీల‌కులు బాధ్యులు. అంతేత‌ప్ప‌.. ఉద్యోగులు బాధ్యులా? అంటే.. ఎవ‌రైనా ఏం చెబుతారు? బాధ్యులు కార‌నే అంటారు. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు మాత్రం ఉద్యోగుల‌నే బాధ్యుల‌ను చేస్తోంది. ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ మ‌ద్ద‌తు దారులు గెల‌వ‌లేక పోయారు. ఇక్క‌డ టీడీపీ ప‌లు గ్రామాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. టీడీపీ గెల‌వ‌డానికి.. వైసీపీ ఓడిపోవ‌డానికి.. వ‌లంటీర్లే కార‌ణ‌మ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు నిర్ధారించేశారు.

టీడీపీ గెలుపొందిన, వైసీపీ ఓడిపోయిన‌ గ్రామాల్లో వాలంటీర్లను తొలగించారు. ప్ర‌స్తుతం ఇది వివాదాస్పదంగా మారింది. ప్ర‌కాశం జిల్లా అద్దంకి మండలంలో టీడీపీ మద్దతు దారులు రెండు గ్రామాల్లో సర్పంచ్ లుగా గెలుపొందారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ రెండో విడతలో అద్దంకి నియోజక వర్గంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అద్దంకి మండలంలోని ధేనువకొండ, మోదేపల్లి గ్రామాల్లో టీడీపీ మద్దతు దారులు పంచాయతీ సర్పంచ్ లుగా గెలుపొందారు. దీంతో రెండు గ్రామాల్లో వాలంటీర్లు సరిగా పని చేయలేదని అధికార పార్టీ నేతలు ఆగ్రహించారు.

ధేనువకొండ గ్రామంలో ఏడుగురు, మోదేపల్లి గ్రామంలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ అద్దంకి ఎంపీడీవో రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ధేనువకొండ గ్రామంలో వాలంటీర్ల తొలగింపుపై బాధిత వాలంటీర్లతో కలిసి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ధేనువకొండ గ్రామ సచివాలయం ఎదుట భైఠాయించి తమ నిరసన తెలిపారు. విధుల్లో నుండి తొలగించిన వాలంటీర్లను తిరిగి తీసుకోవాలని నినాదాలు చేశారు. వాలంటీర్లు విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా రాజకీయ ఒత్తిడిలతో తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు అద్దంకి నియోజక వర్గంలోని మరికొన్ని పంచాయతీల్లో కూడా వాలంటీర్లను తొలిగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ఈ నిర్ణ‌యం తీవ్ర వివాదంగా మార‌డం గ‌మ‌నార్హం.