పోలవరం ఎత్తు తగ్గుతోందా ?

ప్రాజెక్టు పరిధిలో ముంపు తగ్గించటం+వ్యయం తగ్గించటానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఎత్తు తగ్గించటం ఒకటే మార్గమా ? ఇపుడీ అంశంపైనే కేంద్ర జలశక్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటి ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే జలశక్తి సాంకేతిక విభాగం ఉన్నతాధికారులు ఇఫ్పటికే అధ్యయనం చేసినట్లు సమాచారం. ప్రాజెక్టు ఎత్తు ఎంత తగ్గిస్తే ఎంత ముప్పు నివారణకు అవకాశం ఉందనే విషయమై జలశక్తి ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు.

ఎత్తు తగ్గించటమంటే 41.15 మీటర్ల నుండి 38.05 మీటర్లకు తగ్గించాలని ఆలోచిస్తున్నారు. ఇదే ఎత్తు తగ్గించటమే కాకుండా పూర్తిస్ధాయి నీటి నిల్వమట్టాన్ని కూడా తగ్గించటం వల్ల ముంపుతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని అంచనా వేశారు. జలశక్తి ఉన్నతాధికారుల నుండి ఈ విధమైన ప్రతిపాదనలు రావటం వల్ల పోలవరం ప్రాజెక్టు అథారిటి ఉన్నతాధికారులు కూడా ఈనెల 16వ తేదీన ఢిల్లీలో సీరియస్ గా చర్చించారు.

ప్రాజెక్టు ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎత్తు తగ్గించటంతో పాటు నిర్మాణ వ్యయాన్ని కూడా తగ్గించే అవకాశాలను సీరియస్ గా అధ్యయనం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తస్ధాయి నీటిమట్టం 45.72 మీటర్లు. కనీస నీటి నిల్వ 41.15 మీటర్లు. ప్రస్తుత ముంపు ప్రాంతం 1.36 లక్షల ఎకరాలు అయితే 1.07 లక్షల కుటుంబాలు నిర్వాసితులవుతారు. గరిష్ట ప్రవాహ వేగం, వరద ప్రవాహవేగం తదితరాలను అంచనా వేసినపుడు ఎత్తు తగ్గించటమం అంత శ్రయేస్కరం కాదని కూడా కొందరు అభ్యంతరాలు చెబుతున్నట్లు సమాచారం.

ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడు ముంపు ప్రాంతం ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి అనేక సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుంటే మహా అయితే ఎత్తును 1 మీటర్ తగ్గించేందుకు మాత్రమే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయమై జలశక్తి, అథారిటి సాంకేతిక ఉన్నతాధికారులు మరోసారి సమావేశం అవ్వాలని కూడా డిసైడ్ అయ్యింది. మరి తర్వాతి సమావేశంలో ఏమి డిసైడ్ చేస్తారో చూడాలి.