రాష్ట్రంలో కమలంపార్టీ పరిస్ధితి పాతాళంలో ఎక్కడో కనబడకుండా ఉంటుంది. చివరకు టార్చ్ లైట్ వేసి వెతికినా ఎక్కడా కనబడదు. అలాంటి పార్టీ నేతలు మాత్రం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని సొల్లు కబుర్లు చెబుతుంటారు. సరే ఏ పార్టీ అయినా జనాల్లోనే ఉంటే ఏదో రోజుకు ప్రజల ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ ప్రయత్నాలకు మాత్రం అలాంటి అవకాశాలు దక్కుతాయనే ఆశ ఆ పార్టీ నేతలకే లేకుండా పోయింది.
ఈ పరిస్దితికి ప్రత్యర్ధి పార్టీలు కారణం కాదు. పార్టీ జాతీయ నాయకత్వం, కేంద్రప్రభుత్వ విధానాలు కలిపి రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల అవకాశాలను పాతాళంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాన్నే తీసుకుంటే జనాలకు ఏమని సమాధానం చెప్పుకోవాలో పార్టీ చీఫ్ సోమువీర్రాజుతో పాటు ఎవరికి కూడా దిక్కు తోచటం లేదు. చివరకు సమాధానాలు చెప్పుకోలేక ఉక్కు ప్రైవేటీకరణపై బీజేపీ కానీ కేంద్రప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదని, నిర్ణయం తీసుకోలేదని సొల్లు చెబుతున్నారు.
ఉక్కు ప్రైవేటీకరణ విషయమై పార్లమెంటులో స్వయంగా ఉక్కు శాఖ కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రకటన చేసిన తర్వాతే విశాఖలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇదే విషయమై అవకాశం ఉంటే నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు ఇతర కేంద్రమంత్రులతో మాట్లాడుదామని ఢిల్లీ వెళ్ళిన వీర్రాజు బృందానికి పెద్దగా వర్కవుటైనట్లు లేదు. దాంతో రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత జనాలకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాకే ఎదురుదాడులు మొదలుపెట్టారు.
ఈ విషయాన్ని వదలేస్తే రాష్ట్ర విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్ అంశాలను కేంద్రప్రభుత్వం గాలి కొదిలేసింది. తర్వాత పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై ముప్పుతిప్పలు పెడుతోంది. ఇలా ఏ రూపంలో చూసినా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల ప్రయత్నాలను కేంద్రభుత్వం+బీజేపీ అగ్రనాయకత్వమే అడ్డుకుంటున్నట్లుంది. మరి ఈ దశలో బీజేపీ నేతలు ఏమి చేయాలి ? చేసేదేమీ లేదు ప్రెస్ మీట్లు పెట్టుకుంటు కాలక్షేపం చేసేయటమే.