జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నల్లా నీటిని ప్రతి నెలా 20వేల లీటర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వటం.. ఎన్నికల్లో అనుకున్నంత సానుకూల ఫలితాలు రానప్పటికి.. తాము ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. మాటల్లో చెప్పిన దానికి.. చేతల్లో చూపించే దానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లే… జలమండలి తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇప్పుడు షాకింగ్ గా మారినట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. అపార్ట్ మెంట్ వాసులకు ఫ్రీ వాటర్ అంత తేలిక కాదని చెబుతున్నారు. ఇప్పటివరకు వాటర్ కనెక్షన్ తీసుకునేటప్పుటు ఎవరైతే ఆధార్ కార్డు సమర్పిస్తారో.. వారి పేరుతో లింకు చేసుకుంటే సరిపోయేదన్న మాటను అధికారులు చెప్పారు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన మాటను జలమండలి అధికారులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధార్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం అమలు చేసే పథకాల ప్రయోజనాలుపొందే ప్రతిఒక్కరు తమ ఆధార్ ను అనుసంధానం చేయాలని ఉందని.. దీంతో.. అందరూ లింకు చేసుకుంటే తప్పించి.. ఫ్రీ వాటర్ ప్రయోజనం పొందే అవకాశం లేదంటున్నారు. దీని వల్ల వచ్చే సమస్య ఏమంటే.. హైదరాబాద్ లాంటి మహానగరంలో బహుళ అంతస్తుల్లో నివాసాలే అధికం. ఉదాహరణకు 20 నుంచి 40 మధ్య ప్లాట్లు ఉండే అపార్ట్ మెంట్లు ఎక్కువ.
కొత్తగా తెచ్చినట్లుగా చెబుతున్న నిబంధన ప్రకారం.. ఒక అపార్ట్ మెంట్ లో 50 ప్లాట్లు ఉంటే.. యాభైమంది యజమానులు తమ ఆధార్ ను జలమండలి క్యాన్ నంబరుకు లింకు చేసుకుంటేనే ఉచిత నీరు ఇస్తారు.
దీంతో.. ఆధార్ అనుసంధానం చేయటానికి ప్రతి ఒక్కరు వేలిముద్రను వేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఉచిత నీటికి అవకాశం ఉంటుంది. ఒకవేళ.. యాభై ప్లాట్లలో ఒక పది మంది ఏదైనా కారణంతో అందుబాటులో లేకుంటే.. అలాంటి వారికి చుక్కలు తప్పవంటున్నారు. ఎందుకంటే.. యాభై ప్లాట్లు ఉన్న ఇంటికి ఒకే కనెక్షన్ తో బల్క్ బిల్లు ఇస్తారు. ఆధార్ అనుసంధానం చేయని వారి ఇళ్లకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఇచ్చినా.. దానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదెలా లెక్కిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ సమస్య పరిష్కారం కోసం జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాన్ని పొందటానికి ఇన్ని కష్టాలా అనిపించట్లేదు?