పీవీ కుమార్తెకు టికెట్.. కేసీఆర్ కు పోయేదేమీ లేదు

రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేయాలన్న విషయంలో గులాబీ బాస్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు భిన్నంగా ఉంటుంది. కీలకమైన ఎన్నికల వేళ..సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసి సంధిస్తున్న గులాబీ బాస్ చతురతకు ఫిదా కావాల్సిందే. తెలంగాణ అధికార పార్టీకి మొదట్నించి షాకుల మీద షాకులు ఇచ్చే అతి కొద్ది ఎన్నికల్లో హైదరాబాద్ పట్టభద్రుల ఎన్నికగా చెప్పాలి. మరెక్కడైనా గులాబీ హవా కనిపిస్తుందేమో కానీ.. వంగ తోట దగ్గర మాత్రం కాదన్న వాదనకు నిలువెత్తు ఉదాహరణలా నిలుస్తుంది హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం.

ఈసారి ఎలా అయినా.. ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలన్నదే గులాబీ బాస్ ఎజెండా. అందుకే పార్టీకి చెందిన పలువురు సీనియర్టతో సుదీర్ఘ చర్చలు.. భేటీలు జరిగిన తర్వాత తాజాగా దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తె వాణిదేవిని బరిలోకి దించుతూ ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. విద్యాధికురాలైన ఆమె మీద ఎలాంటి బ్యాడ్ రిపోర్టు లేదు. అధ్యాపకురాలిగా ఆమెకున్న పేరు ప్రఖ్యాతులతో పాటు.. పీవీ ట్యాగ్ తమను క్షేమంగా బయటపడేస్తుందన్న నమ్మకమే ఆమెను ఎంపిక చేయటానికి కారణంగా చెబుతున్నారు. దీంతో.. ఎప్పుడూ విజయానందాన్ని అస్వాదించని హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో సంచలన విజయాన్ని నమోదు చేయాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది.

ఈ ఎంపికను పరిశీలిస్తే.. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ అనుసరించిన వ్యూహం ఆసక్తికరంగా మారింది. పీవీని నెత్తిన పెట్టుకొని మోస్తున్న టీఆర్ఎస్.. అదేదో మాట వరుసకు కాదని.. ఆయన కుటుంబం మీద కేసీఆర్ కున్న అభిమానం అంతా ఇంతా కాదన్న భావన కలిగేలా చేయటమే కాదు.. కాంగ్రెస్ పార్టీ చేయని పనిని తాను చేసినట్లుగా కలరింగ్ ఇవ్వటంలో గులాబీ బాస్ సక్సెస్ అయినట్లే.

ఇక.. ఎన్నికల ఫలితం ఎలా వచ్చినా.. టీఆర్ఎస్ తో సంబంధం లేకుండా వాణీదేవికి తగిలిన ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. పీవీ కుమార్తెకు టికెట్ ఇవ్వటం ద్వారా.. తన కర్తవ్యాన్ని తాను చేసినట్లుగా చెప్పుకునే అవకాశంతో పాటు.. ఎన్నికల్లో ఓటమికి తన బాధ్యత లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నట్లేనని చెప్పాలి. మొత్తంగా చూసినప్పుడు తరచూ చేదు అనుభవాన్ని మిగిల్చే హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా.. అతి తక్కువ డ్యామేజ్ తో బయటపడేలా కేసీఆర్ తాజా ప్లాన్ ఉందని చెప్పాలి. మరి.. మూడు జిల్లాల ఓటర్లు ఎలాంటి తీర్పును ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.