ఓట్ల కోసం.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు పార్టీలు వేయని ఎత్తులు లేవు. ఈ క్రమంలోనే బంగారం నుంచి మద్యం వరకు.. నగదు నుంచి చీరల వరకు ఇలా.. అనేక రూపాల్లో.. రాజకీయ నేతలు.. ప్రజలను ప్రలోభ పరుచుకుని.. తమ పబ్బం గడుపుకొన్న విశేషాలు అనేకం.. తాజాగా పంచాయతీ ఎన్నికలలోనూ మనకు కనిపించాయి.
అయితే.. ఏకంగా తిరుమల శ్రీవారి లడ్డూను కూడా ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకున్న ప్రబుద్ధులైన నాయకులు ఉన్నారా? అంటే.. ఉన్నారనే అంటున్నారు తిరుపతి ప్రజలు. ఇక్కడి వైసీపీ నాయకుడు.. ఫైర్ బ్రాండ్ నేత.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటిదే జరిగింది.
చంద్రగిరి నియోజకవర్గం, తొండవాడ పంచాయతీలో ఎన్నికల కోసం దేవుడికి కూడా రాజకీయాలు అంటగడుతున్నారు. తిరుపతి లడ్డూకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు దాన్ని కూడా వైసీపీ నేతలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రగిరి నియోజకవర్గం, తొండవాడ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్ స్లిప్తోపాటు శ్రీవారి లడ్డూలను పంచిపెడుతున్నారు. ‘లడ్డూ తీసుకోండి.. మాకు ఓటువేయండి’ అని ప్రచారం చేస్తున్నారు. అంటున్నారు. తొండవాడలో ఓటర్లకు శ్రీవారి లడ్డూలు పంపిణీ చేసేందుకు ఏకంగా రేషన్ సరఫరా చేసే వాహనాలను ఉపయోగిస్తుండడం గమనార్హం.
కరోనా తర్వాత తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడ స్వామివారి లడ్డూలు దొరక్కా భక్తులు ఇబ్బందిపడుతున్నారు. వైసీపీ నేతలకు మాత్రం లడ్డూలకు కరువేలేదు. దర్జాగా తిరుమల నుంచి తీసుకువచ్చి పంచుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు చూసీ, చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఇక దేవుడ్ని కూడా రాజకీయాల్లోకి దింపారంటూ.. వైసీపీ నేతల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా.. కూడా వైసీపీ నేతలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. శ్రీవారి లడ్డూతో పాటు స్లిప్పులు పంచుతున్నారు. కాగా, ఇక్కడ నాలుగో దశలో అంటే.. ఈ నెల 21న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మరి శ్రీవారి లడ్డూ.. ఏమేరకు ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates