బీజేపీ-జ‌న‌సేన పొత్తుకు బ్రేక్ ప‌డుతుందా? రీజ‌నేంటంటే

ఏపీలో బీజేపీ ప‌రిస్థితి నానాటికీ ఇబ్బందిగా మారుతోందా? ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ యాల‌తో ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చ‌లేక నాయ‌కులు ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రోవైపు.. పొత్తు పెట్టుకున్న జ‌న‌సేన పార్టీ.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. త‌మ‌కు హ్యాండిచ్చేందుకురెడీ అవుతుండడం తో ఏం చేయాలో తెలియ‌ని ఓ సందిగ్ధ స్థితిలో బీజేపీ నేత‌లు కొట్టుమిట్టాడుతున్నార‌ని అంటున్నారు ప‌రి శీ ల‌‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల మ‌ద్య విస్తృతంగా ప‌ర్య‌టించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ విష‌యం తెర‌మీదికి వ‌చ్చే స‌రికి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు క‌నీసం.. ఆయ‌న మీడియాముందుకు కూడా రావ‌డం మానేశారు.

మీడియా ముందుకు వ‌స్తే..విశాఖ ఉక్కుపై ఏం చెప్పాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌రోవైపు.. త‌మ‌తో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని పార్టీ జ‌న‌సేన‌.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ డం కూడాసోమును ఇబ్బంది పెడుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ తొలి విడ‌త ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రిలోని నాలుగు పంచాయ‌తీల్లో టీడీపీ మ‌ద్ద‌తుదారులుగా ఉన్న‌వారు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. వీరికి క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన మద్ద‌తు దారులు స‌హ‌క‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. వారు కూడా బ‌హిరంగంగానే తాము జ‌న‌సేన నేత‌ల నుంచి స‌హ‌కారం తీసుకున్నామ‌ని వివ‌రించారు. ఈ ప‌రిణామం.. బీజేపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మాతో పొత్తు పెట్టుకుని.. టీడీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఏంట‌నేది బీజేపీ నేత‌ల ప్ర‌శ్న‌. అయితే.. దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన కీల‌క నేత‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. క‌నీసం వారు ఖండిచ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు ఎప్ప‌టికైనా జ‌న‌సేన‌తో ఇబ్బందేన‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. తిరుపతి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయ‌క‌పోతే.. ఆ పార్టీ బీజేపీతో క‌లిసి న‌డిచేది లేద‌ని ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన సంకేతాలు వ‌స్తున్న ద‌రిమిలా.. పంచాయ‌తీల్లో ఇలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోవడంతో పొత్తు విష‌యంపై క్లారిటీ కోసం బీజేపీ నాయ‌కులు త్వ‌ర‌లోనే పవ‌న్‌తో భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. బీజేపీకి ఇదొక సంక‌ట స్థితే అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు టీడీపీ .. జ‌న‌సేన‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం కూడా వాస్త‌వంగానే క‌నిపిస్తోంది.