మోడీ ఎఫెక్ట్‌: నిర్మ‌ల చెల‌రేగిపోయారు.. అస‌లు రీజ‌న్ ఇదే!!

పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల చివ‌రి రోజు..(శ‌నివారం) లోక్ స‌భ‌లో చాలా చిత్ర‌మైన ప‌రిణామం చోటు చేసుకుంది. పెద్ద‌గా రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, ప్ర‌తిప‌క్షాల‌పై దూకుడు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌ని.. పేరు కు త‌గిన‌ట్టు వ్య‌వ‌హ‌రించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. రెచ్చిపోయారు. బ‌హుశ‌.. ఆమె దూకు డు, వ్యాఖ్య‌లు, గుక్క తిప్పుకోనివ్వ‌ని.. వాక్చాతుర్యం.. వంటివి గ‌మ‌నిస్తే… చెల‌రేగిపోయారు.. అని అన‌డం లో సందేహం లేదేమో! బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ స‌భ‌లో మాట్లాడ‌డం సాధార‌ణం. అయితే..ఈ ద‌ఫా .. ఈ బ‌డ్జెట్ సెష‌న్ అంతా కూడా కాంగ్రెస్ సెష‌న్‌గా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

బ‌డ్జెట్ స‌మావేశాల్లో అటు రాజ్య‌స‌భ‌లోను, ఇటు లోక్ స‌భ‌లోనూ అధికార బీజేపీ నాయ‌కులు.. ప్ర‌ధాని, స‌హా కీల‌క మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీని భారీఎత్తున టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. నాలుగు రోజుల కింద‌ట‌.. రాజ్య‌స‌భ‌లో కాంగ్రెస్ ప‌క్ష నాయ‌కుడు.. గులాంన‌బీ ఆజాద్ కు వీడ్కోలు ప‌లుకుతున్న స‌మావేశంలో .. ఏకంగా ప్ర‌ధాని మోడీ.. సెంటిమెంటు క‌న్నీరు పెట్టుకుని.. ఒక్క‌సారిగా.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న బ‌డ్జెట్పై చ‌ర్చ‌ను దారి మ‌ళ్లించారు. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు బ‌డ్జెట్‌పై సీరియ‌స్ గా డిస్క‌ష‌న్ చేయాల‌ని అనుకున్న వారు కూడా ఈ ప‌రిణామం త‌ర్వాత‌.. ఏమీ మాట్లాడ‌లేక పోయారు. త‌న‌కు సంబంధం లేని ఆజాద్ విష‌యంలో మోడీ క‌న్నీరు పెట్టుకోవ‌డం వెనుక‌.. కాంగ్రెస్ టార్గెట్ చేయ‌డ‌మేన‌ని అప్ప‌ట్లో విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

ఇక‌, తాజాగా లోక్‌స‌భ చివ‌రి రోజు శ‌నివారం.. స‌భ‌లో దాదాపు ఒక గంటా 40 నిముషాల సేపు.. నిర్విరామంగా ప్ర‌సంగించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌. ఈ సంద‌ర్భంగా.. బ‌డ్జెట్ లోతుపాతుల‌ను తొవ్వి తీశారు. గ‌త ఏడాది క‌రోనా నేప‌థ్యంలో తాము ఎంత దీటుగా ఎదుర్కొన్న‌దీ చెప్పుకొచ్చారు. అయితే.. అంత‌టితో నిర్మ‌ల ఆగ‌లేదు. ఏకంగా.. కాంగ్రెస్‌ను అడుగ‌డుగునా టార్గెట్ చేశారు. కాంగ్రెస్‌కు భార‌త ప్ర‌జాస్వామ్యంపై న‌మ్మ‌కం లేద‌ని చెల‌రేగిపోయారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు అరువు తెచ్చుకున్న‌వ‌ని.. బీజేపీ వ్య‌వ‌స్థాగతంగా.. సంస్థాగ‌తంగా కూడా ఇక్క‌డ ఎదిగిన‌.. ఇక్కడ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన పార్టీ అని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు బీజేపీలో చోటు లేద‌న్న నిర్మ‌ల‌.. కాంగ్రెస్‌కు-వార‌స‌త్వం త‌ప్ప‌..మ‌రో మార్గంలేద‌ని.. విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇన్ని ద‌శాబ్దాల భార‌త దేశ చ‌రిత్ర‌లో ఏ నాడైనా పేద‌ల గురించి,మ‌హిళ‌ల గురించి ఆలోచించారా? అని నిగ్గ‌దీసిన‌.. నిర్మ‌ల‌.. తాము ఏం చేస్తున్నామో.. ఏక‌రువు పెట్టారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. కానీ.. ఉన్న‌ప‌ళాన‌.. లోక్‌స‌భ‌లో (ఎవ‌రికీ అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా) నిర్మ‌ల ఇంత‌గా రెచ్చిపోవ‌డం వెనుక చాలా వ్యూహం ఉంది. చివ‌రి రోజు.. ముక్తాయింపు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉంటే.. అదే ఇంపాక్ట్ ప‌డుతుంద‌ని.. భావించిన బీజేపీ పెద్ద‌లు ఈ వ్య‌తిరేక‌త‌ను చాలా వ్యూహాత్మ‌కంగా.. కాంగ్రెస్ పైకి నెట్టి.. బ‌డ్జెట్‌పై ఇత‌ర ప‌క్షాల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను చాలా నిశితంగా త‌ప్పించుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయినా.. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌నే విష‌యాన్ని బీజేపీ నేత‌లు గుర్తిస్తే.. బెట‌రేమో!!