ష‌ర్మిల పార్టీ టార్గెట్ ఏమిటి? తెలంగాణలో ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ‌

తెలంగాణ రాజ‌కీయాల్లోకి కొత్త రాజ‌కీయ పార్టీతో ఎంట్రీ ఇస్తున్న వైఎస్ రాజ‌న్న కుమార్తె.. ష‌ర్మిల టార్గెట్ ఏంటి? ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీకి సంబంధించి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ, తెలంగాణ రాజ‌న్న రాజ్యం.. పేర్ల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద న‌మోదు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనిలో ఒక పేరును ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. అస‌లు ష‌ర్మిల తెలంగాణ‌లో ఎంట్రీ ఇవ్వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంటి? రాష్ట్రంలో ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్య‌తా? లేక‌.. కేసీఆర్‌పై ప్ర‌త్యక్ష యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నారా? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.

కేసీఆర్ విష‌యాన్ని తీసుకుంటే.. ఏపీలో సీఎంగా ఉన్న జ‌గ‌న్‌ను త‌న‌కు మిత్రుడు అంటూనే ఆయ‌న కొన్ని కొన్ని విష‌యాల్లో బెదిరింపులు, ధిక్కాల‌కు ఆస్కారం ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది జ‌గ‌న్‌ను క‌ల‌చి వేస్తోంది. అదేస‌మ‌యంలో హైద‌రాబాద్ స‌హా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్‌, రంగారెడ్డి.. న‌ల్ల‌గొండ జిల్లాల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేసిన అభివృద్ధి నేటికీ చెక్కుచెద‌ర‌లేదు. అదేస‌మ‌యంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లోనూ వైఎస్ స్థాయిలో నాయ‌క‌త్వం లేద‌నే ఆవేద‌న కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉభ‌య కుశ‌లోప‌రిగా ఉంటుంద‌నే తెలంగాణ‌లో ష‌ర్మిల అడుగులు వేస్తున్న‌ట్టు అంచ‌నాకు రావాల్సి వుంది.

ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ‌ను న‌డిపించే నాయ‌క‌త్వం కేవ‌లం కేసీఆర్ వైపే ఉంద‌నే ఆలోచ‌న ఉంది. కేసీఆర్ త‌ప్ప ఇత‌ర పార్టీల‌ను తీసుకున్నా.. తెలంగాణ‌ను న‌డిపించే నాయ‌క‌త్వ ప‌టిమ ఉన్న నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. ఇదే..కేసీఆర్‌కు వ‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం, దివంగ‌త సీఎం.. వైఎస్ వార‌స‌త్వం వంటివి మెండుగా ఉన్న ష‌ర్మిల‌.. ఎంట్రీ రాజ‌కీయంగా తెలంగాణ‌లో కీల‌క మార్పున‌కు నాందిప‌ల‌కడం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సీఎం పీఠ‌మే ల‌క్ష్యంగా ష‌ర్మిల వేస్తున్న అడుగులు .. స‌క్సెస్ అవుతాయా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఆవ‌రించిన రాజ‌కీయ శూన్య‌త‌కు చ‌క్క‌ని స‌మాధానం చెబుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.