విశాఖ స్టీల్స్ ప్రైవేటుపరం చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఉత్తరాంధ్రలో ప్రధానంగా వైజాగ్ లో ఎంతగా నిరసన వ్యక్తమవుతోందో అందరికీ తెలిసిందే. ఫ్యాక్టరీలోని ఉద్యోగ, కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు అంతా ఏకతాటిపైకి వచ్చి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా చేసేశారు. చివరకు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కూడా ఢిల్లీలో అగ్రనేతలతో సమస్యను చర్చిస్తామని చెప్పారు.
ఒకవైపు క్షేత్రస్ధాయిలో ఇంత గందరగోళం జరుగుతుంటే మరోవైపు టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సుజనా చౌదరి మాత్రం కేంద్రం నిర్ణయానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ పై కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ ఆర్ధికరంగానికి ఉపయోగపడుతుందట. కేంద్రం నిర్ణయంతో వైసీపీ, టీడీపీలు విభేదించినంత మాత్రాన ప్రైవేటీకారణ ఆగదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ప్రస్తుత ఆర్ధిక పరిస్దితులను, టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుంటే కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ సుజనా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుజనాకు ప్రజలతో ఏమాత్రం సంబంధం లేదు. ఎప్పుడూ రాజ్యసభ సభ్యత్వం తీసుకుని ఎంపిగా కంటిన్యు అవుతున్నారు. 24 గంటలూ జనాల్లో తిరిగే కమలం నేతలేమో కేంద్రం నిర్ణయంతో పార్టీకి ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారు.
అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్ధితి కేంద్రం నిర్ణయంతో మరింత దిగజారిపోతుందని టెన్షన్ పడుతున్నారు. ఈ పరిస్దితుల్లో సుజనా వ్యాఖ్యలతో ఒరిజినల్ బీజేపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. క్షేత్రస్ధాయిలో జనాల వ్యతిరేకత, రాజకీయ పార్టీల ఆందోళన చూస్తు కూడా సుజనా కేంద్రానికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే పార్టీకి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.