రాజకీయాలన్నాక మొహమాటాలు అస్సలు ఉండవు. ఆ రంగంలో ఉన్నంత కర్కసత్వం మరెక్కడా కనిపించదంటారు. అందుకే.. సున్నిత మనస్కులు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదన్న సలహా తరచూ వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయటం.. ఘాటు వ్యాఖ్యలు చేయటం మామూలే. కీలక స్థానంలో ఉన్న వ్యక్తుల విషయంలో చేసే వ్యాఖ్యలు ఆచితూచి అన్నట్లు ఉండాలి.కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారుల్ని నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్రీవాల్ని ఆపటం చూస్తే.. ఆయన మీద ఆయనకే నమ్మకం లేకుండా పోయిందా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని.. అలా చేయకుండా ఉండటం సరికాదన్నారు.
ఏకగ్రీవాలు ఎక్కువగా ఉన్న గుంటూరు.. చిత్తూరు కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు ఇచ్చిన నిమ్మగడ్డ.. ఆ ఫలితాల్ని పరకటించొద్దని.. ఫిర్యాదుల్ని పరిష్కరించిన తర్వాతే వెల్లడించాలని పేర్కొన్నారు. దీనిపై అధికారపక్ష నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే రోజా మరో అడుగు ముందుకేసి.. నిమ్మగడ్డపై ఘాటు విమర్శల్ని సంధించారు.
ఏకగ్రీవాలు ఎక్కువగా ఉన్న ప్రకటించిన చోట లోపాలు ఉన్నట్లు తేలితే.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. ఇదే క్రమంలోతాజాగా ఎక్కువ ఏకగ్రీవాలు నమోదైన చిత్తూరు జిల్లా ఫలితాల్ని ప్రకటించకుండా నిలిపివేయాలని నిమ్మగడ్డ ఆదేశించటంతో రోజా బరస్ట్ అయ్యారు. మరి.. ఈ తరహా విమర్శపై నిమ్మగడ్డ ఎలా రియాక్టు అవుతారో చూడాలి. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వారి విషయంలో నోరు పారేసుకోకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates