తెలుగుదేశం పార్టిలో జైలుపాలై విడుదలైన వారిని లేకపోతే వారి కుటుంబసభ్యులను చంద్రబాబునాయుడు, లోకేష్ పరామర్శిస్తున్నారు. నేతల్లో ఆత్మస్ధైర్యం నింపటానికి ఆపత్ సమయంలో కష్టాల్లో ఉన్న నేతలకు పార్టీ అండగా ఉంటుందని చెప్పటానికే అగ్రనేతలు, అధినేతలు ఇటువంటి పరామర్శలు పెట్టుకుంటారు. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీలేదు. అవినీతి కేసులో అరెస్టయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు, హత్యారోపణలపై అరెస్టయిన మరో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, అక్రమాలు చేసి దొరికిపోయి అరెస్టయిన మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను తండ్రి, కొడుకులు ఇలాగే పరామర్శించారు.
తాజాగా గుర్తుతెలీని వ్యక్తుల దాడిలో గాయపడినట్లు చెబుతున్న పార్టీ అధికార ప్రతినిధి పట్టాబిరామ్ ను ఇంటికి వెళ్ళి చంద్రబాబు మాట్లాడి ధైర్యం చెప్పొచ్చారు. అంతా బాగానే ఉంది కానీ మధ్యలో భూమా అఖిలప్రియను మాత్రం తండ్రి, కొడుకులు ఎందుకు వదిలేసినట్లు ? హైదరాబాద్, బోయినపల్లిలోని రియాల్టర్లైన ముగ్గురు సోదరులు కిడ్నాప్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఆ కిడ్నాప్ లో మాజీమంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియే సూత్రదారిగా బయటపడింది.
అఖిల భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి, అత్త మామలు ఇలా కుటుంబం అంతా కిడ్నాప్ లో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. రాజకీయాలన్నాక కిడ్నాపులు, అవినీతి, దాడులు మామూలైపోయాయి. వివాదాలు ఒక్కోసారి హత్యల దాకా వెళిపోతుంది. మరి కిడ్నాప్ కేసులు రిమాండ్ లో ఉండి విడుదలైన అఖిలను మాత్రం ఎందుకు చంద్రబాబు, లోకేష్ పరామర్శించలేదన్నది పాయింట్.
అఖిలను పరామర్శించకపోతే పోయె చివరకు ఆమె అపాయిట్మెంట్ అడిగినా ఇవ్వటం లేదట. చివరకు ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించినా మాట్లాడటానికి చంద్రబాబు ఇష్టపడలేదట. అసలు అఖిల రిమాండ్ లో ఉన్నపుడే చంద్రబాబును కలవటానికి ఆమె కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నం ఫెయిలైందని సమాచారం. పార్టీలో జరుగుతున్నది చూస్తుంటే టీడీపీకి అఖిల కుటుంబానికి మధ్య సంబంధాలు తెగిపోయినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.