డియర్ ఇండియన్స్.. సెంచరీకి రెడీగా ఉండండి

‘‘పెట్రోల్ 100 అయిన వెంటనే బండి రోడ్ మధ్యలో ఆపండి. హెల్మెట్ తీయండి. ఆకాశం వైపు చూడండి. హెల్మెట్‌ను ముద్దాడండి. క్రికెటర్లను ఇలాగే సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటారు మరి’’.. కొన్ని రోజులుగా వాట్సాప్‌లో, ఇతర సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న జోక్ ఇది. ఇండియాలో రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. సెంచరీ వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఈ జోక్ పుట్టింది.

ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర రూ.90 మార్కును దాటేసింది. కొన్ని చోట్ల 94-95 మధ్య కూడా ఉంది లీటర్ ధర. ఇప్పుడు బడ్జెట్లో వడ్డింపులు చూస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును టచ్ చేయడానికి ఎన్నో రోజులు పట్టదు అనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తరచుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా.. తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తమ వంతుగా పన్నుల బాదుడుకు కూడా సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు.

అగ్రి సెస్ పేరుతో పెట్రోల్ మీద రెండున్నర రూపాయలు, డీజిల్ మీద 4 రూపాయలు వడ్డించనున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రాలు తమ వంతుగా ఏవో పన్నులు జోడించాయంటే ఇంకొన్ని రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ మార్కును అందుకోవడం ఖాయం. ఏదో జోక్ లాగా సెంచరీ గురించి చెప్పుకున్నాం కానీ.. అది నిజమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవన్నమాట.

ఓవైపు పొరుగున ఉన్న, మనకంటే చిన్న, పేద దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో ఇండియాతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉండగా.. మన దేశంలో మాత్రం పన్నుల పేరుతో తరచుగా ధరలు పెంచి ఈ స్థాయికి తీసుకురావడం దారుణమన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇంధన ధరల పెంపు విషయంలో గత ప్రభుత్వాలను తప్పుబట్టి, అధికారంలోకి వచ్చాక ముందున్న వాళ్లకంటే అధికంగా వడ్డింపులతో ప్రజల నడ్డి విరుస్తుండటం శోచనీయం.