వాహనాల విషయంలో కేంద్రప్రభుత్వం తాజా బడ్జెట్లో సరికొత్త నిర్ణయం తీసుకుంది. వాహనాల విషయంలో తీసుకున్న కొత్త విధానాన్ని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వివరించారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ళ డెడ్ లైన్ విధించారు. పై కాలపరిమితి ముగిసిన తర్వాత వాహనాలను ఫిట్ నెస్ టెస్టు చేయించాల్సిందే అనే కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
అంటే కేంద్రమంత్రి ఉద్దేశ్యం ప్రకారం వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ళు, కమర్షియల్ వాహనాలకు 15 సంవత్సరాలు పూర్తియితే వాటి జీవిత కాలం అయిపోయినట్లే. లైఫ్ టైం అయిపోయిన వాహనాలను తిప్పటం వల్ల నష్టాలు జరుగుతాయని ఆటోమొబైల్ రంగంలోని నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. వాహనాల పనితీరు బాగా పడిపోతుంది. దీనివల్ల వాటి సామర్ధ్యం తగ్గిపోవటం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలున్నట్లు నిపుణులు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు.
ఇపుడు జరుగుతున్న వాహనాల్లో చాలావరకు లైఫ్ టైం అయిపోయిన వాహనాలే అన్న విషయాలు బయపడుతున్నాయి. ముఖ్యంగా బస్సులు, లారీల ప్రమాదాల్లో ఈ విషయాలు స్పష్టంగా తెలిసిపోతోంది. అందుకనే రవాణాశాఖ చట్టాల్లో కూడా లైఫ్ టైం వాహనాల విషయాల్లో అనేక మార్పులు తెచ్చింది. మామూలుగా అయితే ప్యాసెంజర్ బస్సుల జీవితకాలం 7 లక్షల కిలోమీటర్లు. కానీ పది లక్షలు, 15 లక్షల కిలోమీటర్లు దాటిపోయిన బస్సులు కూడా ఇంకా తిరుగుతునే ఉంటాయి.
ఇటువంటి వాహనాల విషయంలోనే తాజా బడ్జెట్లో నిబంధనలు తెచ్చారు. పై కాలపరిమితి దాటిపోయిన వాహనాలను తుక్కుగా మార్చేస్తామని కేంద్రమంత్రి స్పష్టంగా ప్రకటించారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని మంత్రి ప్రకటించారు. మంత్రి చెప్పిన నిబంధన గనుక అమల్లోకి వస్తే లక్షలాది ప్రభుత్వ వాహనాలే ముందు తుక్కుగా మారిపోవటం ఖాయం. చూద్దాం కొత్త నిబంధన ఎంతవరకు అమలవుతుందో.