క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పంచాయితి ఎన్నికల మాటేమో కానీ అధికార వైసీపీలో కూడా పంచాయితీలు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య గొడవల కారణంగా కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. దాంతో ఇపుడు పంచాయితి ఎన్నికలకు నామినేషన్లు వేసే విషయంలో పెద్ద నేతల మధ్య విభేదాలు మొదలవ్వటంతోనే కార్యకర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే గన్నవరం, చీరాల, గుంటూరు వెస్ట్, రాజోలు, వైజాగ్ లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఎంఎల్ఏలు అధికారపార్టీ నేతలుగానే చెలామణి అవుతున్నారు. గన్నవరం, రాజోలు, చీరాల, గుంటూరు వెస్ట్, వైజాగ్ ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, కరణం బలరామ్, రాపాక వరప్రసాదరావు, వాసుపల్లి గణేష్, మద్దాలిగిరి లాంటి వాళ్ళు టీడీపీ, జనసేన తరపున గెలిచారు. అయితే వీళ్ళంతా దాదాపు వైసీపీ ఎంఎల్ఏలుగానే చెలామణవుతున్నారు.
ఇంతకాలం వీళ్ళకు పెద్దగా ఇబ్బందులు రాకపోయినా పంచాయితి ఎన్నికల సందర్భంగా సమస్యలు మొదలయ్యాయి. నామినేషన్లు వేయించేందుకు వైసీపీ నేతలు తమ మద్దతుదారులను గ్రామాల్లో రెడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పై ఎంఎల్ఏలు కూడా తమ మద్దతుదారులను రంగంలోకి దింపుతున్నారట. అంటే వైసీపీలోనే రెండు వర్గాలు సర్పంచు పోస్టుకు పోటీ పడుతున్నాయన్నమాట. మరి ఈ పరిణామాన్ని సహజంగానే ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటాయి.
ఎంఎల్ఏ మద్దతుదారులకు తెరవెనుక నుండి టీడీపీ నేతలు సపోర్టు చేస్తు పోటీ చేస్తే గెలిపిస్తామని హామీలు ఇస్తున్నారట. అంటే ఎట్టిపరిస్ధితుల్లోను నామినేషన్ల నుండి వెనక్కుపోకుండా వైసీపీలోని ఎంఎల్ఏ వర్గానికి టీడీపీ ఎరవేస్తోందన్నమాట. రెండు వర్గాల నుండి నామినేషన్లు దాఖలై ఎన్నిక జరిగితే అప్పుడు తాము పోటిచేస్తే ఈజీగా గెలవచ్చని టీడీపీ నేతలు వ్యూహం.
ఈ పరిస్ధితుల్లో ఏమి చేయాలో అర్ధంకాక వైసీపీ సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎంఎల్ఏ మద్దతుదారులకు నచ్చచెప్పాలో లేకపోతే సీనియర్ నేతలకే నచ్చచెప్పి మద్దతుదారులను పోటీ నుండి తప్పించాలో అర్ధం కావటంలేదు. గన్నవరం, చీరాల విషయం ఇఫ్పటికే జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళిందట. జగన్ ఆదేశాల కోసం అందరు ఎదురుచూస్తున్నారు. చూద్దాం జగన్ ఎలా పరిష్కరిస్తారో.