అల్లర్ల తర్వాత వందమంది రైతుల అదృశ్యం ?

మొన్నటి 26వ తేదీన ఢిల్లీలో రైతుసంఘాల ర్యాలీ తర్వాత సుమారు 100 మంది రైతుల ఆచూకీ తెలీటం లేదా ? ఎంతవెతికినా వాళ్ళ జాడ కనబడలేదా ? అంటే అవుననే అంటున్నారు రైతులు, మానవహక్కుల సంఘాలు. ఢిల్లీలో ర్యాలీ సందర్భంగా వీధుల్లోను, ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు బీభత్సం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అల్లర్లకు కారకులంటూ పోలీసులు ఇఫ్పటికే కొన్ని వందల మందిపై రకరకాల కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదు చేయటం, అరెస్టులు చేయటం లేకపోతే విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేయటం మామూలుగా జరిగేదే. కానీ అల్లర్లు జరిగిన రోజు నుండి కనీసం వందమంది రైతులు ఎక్కడా కనబడటం లేదట. ఢిల్లీలో ర్యాలీ జరిగిన తర్వాత అదే రోజు రాత్రం, మరుసటి రోజుకు అంతకుముందు ఉద్యమాలు జరుగుతున్న దీక్షా శిబిరాలకు రైతులంతా చేరుకునేశారు. కానీ వందమంది రైతుల జాడ మాత్రం ఎంత వెతికినా దొరకటం లేదని రైతుసంఘాల నేతలంటున్నారు.

దీక్షా శిబిరాలకు తిరిగి వచ్చిన రైతుల ద్వారా కొందరు రైతులు కనబడటం లేదని సమాచారం అందిందని మానవహక్కుల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కనబడకుండా పోయిన రైతల జాబితాను తీసుకుని గడచిన నాలుగు రోజులుగా తాము ఎంత వెతికినా ఎక్కడా ఆచూకీ కనబడలేదని హక్కుల సంఘం కార్యకర్తలు చెప్పటం సంచలనంగా మారింది. వీరిలో మోగా ప్రాంతంలోని తతారీవాల గ్రామానికి చెందిన 12 మంది రైతుల ఆచూకీ గడచిన ఐదు రోజులుగా కనబడటం లేదట.

కనిపంచకుండా పోయిన రైతుల కుటుంబాల నుండి తమకు సమాచారం అందుతోందని భారతీయ కిసాన్ యూనియర్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ చెప్పారు. మరొకసారి జాగ్రత్తగా వెతికించి అదృశ్యమైపోయిన 100 మంది రైతుల జాబితాను ప్రకటిస్తామన్నారు. 400 మంది రైతులు పోలీసుల అక్రమ కస్టడీలో ఉన్నట్లు సామాజిక హక్కుల కార్యకర్త సరాబ్జిత్ సింగ్ వెర్కా ఆరోపించారు. మొత్తం మీద ఢిల్లీ అల్లర్ల తర్వాత అరెస్టులు, నిర్భందాల్లో ఉన్న రైతులు కాకుండా వందమంది రైతులు కనిపించటం లేదన్న విషయం ఇపుడు సంచలనంగా మారింది. చూద్దాం వీళ్ళ ఆచూకీ ఎప్పుడు బయటపడుతుందో.