‘జ‌న‌సేన‌లోకి చిరు.. ప‌వ‌న్ ఏమ‌న్నాడంటే?


ఈ మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. జ‌న‌సేన పార్టీకి చిరంజీవి నైతిక మ‌ద్ద‌తు ఉంద‌ని, త‌మ్ముడి వెంట అన్న న‌డ‌వ‌బోతున్నార‌ని, త‌మ్ముడికి అండ‌గా ఉంటాన‌ని చిరు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చార‌ని ఆ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన నాదెండ్ల మ‌నోహ‌ర్ వ్యాఖ్యానించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో చిరు జ‌న‌సేన‌లో చేర‌బోతున్నార‌నే ప్ర‌చారం మొద‌లైంది. ఈ విష‌యంపై మీడియా వివిధ కోణాల్లో క‌థ‌నాలు వెలువ‌రిస్తున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ సైతం దీనిపై స్పందించ‌క త‌ప్ప‌లేదు.

విజ‌య‌వాడ‌లో కాపు సంక్షేమ సేన స‌మావేశం సంద‌ర్భంగా ఓ విలేక‌రి చిరుపై నాదెండ్ల వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన‌నానిని ప్ర‌శ్నించారు. దీనికి ప‌వ‌న్ బ‌దులిస్తూ.. చిరంజీవి ఎప్పుడూ నా మేలు కోరే ఏదైనా చెబుతారు. త‌మ్ముడిగా నా విజ‌యాన్ని ఆయ‌న కోరుకుంటారు. మ‌న‌స్ఫూర్తిగా నా విజ‌యాన్ని కాంక్షించే వ్య‌క్తి ఆయ‌న‌. దాన్ని అలాగే చూడాలి. ఆయ‌న పార్టీలోకి వ‌స్తారా లేదా అన్న‌ది ఈ రోజే చెప్ప‌లేను. అది చిరంజీవి గారి అభిప్రాయం అని ప‌వ‌న్ పేర్కొన్నాడు.

మ‌రోవైపు కాపుల‌కు వివిధ రాజ‌కీయ పార్టీలు చేస్తున్న అన్యాయంపై ప‌వ‌న్ మాట్లాడారు. రాష్ట్ర జ‌నాభాలో 27 శాతం ఉన్న‌ కాపుల‌ను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నార‌ని.. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కులాల కార్పొరేష‌న్లు ఆయా వ‌ర్గాల‌కు తాయిలాలే అని.. ఆయా వ‌ర్గాల నేత‌లు రాజ‌కీయ సాధికారిత వైపు చూడ‌కుండా చేసే ప‌న్నాగ‌మే ఈ కార్పొరేష‌న్ల ఏర్పాట‌ని ప‌వన్ వ్యాఖ్యానించాడు. త‌న‌ను ఒక కులానికి ప్ర‌తినిధిగా చూడొద్ద‌ని, తాను అంద‌రి వాడిన‌ని ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా పేర్కొన్నాడు.