ఆపరేషన్ ఆకర్ష్ విషయంలో కమలంపార్టీ దూకుడు పెంచినట్లే ఉంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఉపఎన్నికకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకునే విషయంలో జోరు పెంచింది. తాజాగా టీఆర్ఎస్ ఎంఎల్సీ తేరా చిన్నపరెడ్డి కమలంవైపు చూస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతంలోని ఓ హైడౌట్ లో బీజేపీ ముఖ్యనేతలు చిన్నపరెడ్డితో భేటి అయినట్ల సమాచారం.
చిన్నపరెడ్డి కొంతకాలంగా పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కేసీయార్ విషయంలో బాగా అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ ఎంఎల్సీలోని అసంతృప్తిని గమనించిన తర్వాతే కమలనాదులు చిన్నపరెడ్డికి గాలం వేశారట. వీళ్ళ రహస్య భేటిలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలో బీజేపీ తరపున తనకు టికెట్ ఇస్తే తాను వెంటనే పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట.
అయితే ఇదే విషయాన్ని తమపార్టీ అగ్రనేతలతో చర్చించి తర్వాత చెబుతామని బీజేపీ నేతలు సమాధానమిచ్చారని సమాచారం. ఉపఎన్నికలో టికెట్ కాకుండా ఇంకేమి అంశాలు చర్చకు వచ్చాయో స్పష్టంగా తెలియటం లేదు. మొత్తం మీద అధికార టీఆర్ఎస్ లో నుండి ఓ ప్రజాప్రతినిధి బీజేపీలోకి వెళితే ఆ విషయం సంచలనంగా మారుతుందనటంలో సందేహం లేదు. చిన్నపరెడ్డి అంశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అగ్రనేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్ నుండి విజయశాంతి, టీఆర్ఎస్ నుండి స్వామిగౌడ్ ఇప్పటికే బీజేపీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. స్వామిగౌడ్ శాసనమండలి ఛైర్మన్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ పదవి అయిపోయిన తర్వాత గౌడ్ ను కేసీయార్ పట్టించుకోకపోవటంతో అలిగి బీజేపీలో చేరిపోయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదే ఊపులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సర్వే సత్యనారాయణతో కూడా బీజేపీ నేతలు మంతనాలు జరుపుతున్నారట. మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ తో కమలనాదులు మంచి ఊపుమీదున్నట్లే కనబడుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates