ప్ర‌మాణాలు పూర్తి.. `ప్ర‌యాణాలే` ముఖ్యం!

ఏపీలోని కీల‌క‌మైన 13 మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో మేయ‌ర్లు, కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ స్వీకారాలు పూర్త‌య్యాయి. ఈ నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు 12 కార్పొరేష‌న్ల‌ను ద‌క్కించుకున్నాయి. ఒక్క అనంత‌పురం మేయ‌ర్ పీఠాన్ని మాత్ర‌మే వైసీపీ ద‌క్కించుకుంది. దీనిపైనా న్యాయ‌ప‌ర‌మైన వివాదం త‌లెత్తింది. ఇక‌, 12 స్థానాల్లో మ‌రింత కీల‌క‌మైన విజ‌య‌వాడ‌, గుంటూరు, విశాఖ వంటి స్థానాల్లో మేయ‌ర్లు, కార్పొరేట‌ర్లు కొలుదీరారు. మొత్తంగా.. కూట‌మి పార్టీల పాల‌న క్షేత్ర‌స్థాయిలోనూ ప్రారంభ‌మైంది.  

13 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 87 మున్సిపాలిటీలలో నూతనంగా ఎన్నికైన మేయర్లు, కార్పొరేటర్లు, చైర్‌పర్సన్ ల ప్రమాణ స్వీకార ప్రక్రియ పూర్త‌యింది. అనంతరం డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా కొన‌సాగ‌నున్నాయి వీటిని ప్ర‌త్య‌క్షంగా కాకుండా ప‌రోక్షంగా ఎన్నుకోనున్నారు. అంటే.. అభ్య‌ర్థులు చేతులు ఎత్త‌డం ద్వారా డిప్యూటీ మేయ‌ర్‌ను ఎన్నుకోనున్నారు.

విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతిలో మేయర్‌తో పాటు 66 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖపట్నంలో 119 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్‌గా పందిరి వెంకట శివప్రసాద్‌కు అవ‌కాశం క‌ల్పించారు. గుంటూరులో టీడీపీ అభ్య‌ర్థి ల‌క్ష్మీ అప‌ర్ణ ప్ర‌మాణ స్వీకారం పూర్త‌యింది. మొత్తంగా కీల‌క‌మైన ప్ర‌క్రియ సానుకూలంగానే సాగిపోయింది.

అయితే.. అస‌లు విష‌యానికి వ‌స్తే.. పాల‌న‌లోనే మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు క‌లివిడి చూపించాల్సిన అవ‌స‌రం ఉంది. అన్ని కార్పొరేష‌న్ల‌లోనూ.. మేయ‌ర్‌ల‌ను టీడీపీ, జ‌న‌సేన పంచుకున్నాయి. ఇలా.. పంచుకున్న స్థానాల్లో రెండో పీఠ‌మైన డిప్యూటీ మేయ‌ర్ స్థానాన్ని మ‌రో మిత్ర ప‌క్షానికి కేటాయించారు.

ఈ ఇద్ద‌రు అధికార ప‌ద‌వుల్లో ఉన్న వారి మ‌ధ్య స‌మ‌న్వ‌యం, క‌లివిడి అత్యంత కీల‌కం. న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయ‌డ‌మే కాకుండా.. సీఎం చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టుగా.. పార్టీని ముఖ్యంగా కూట‌మిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కించేందుకు కూడా వీరు కృషి చేయాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్నా.. ప్ర‌మాణం చేసినంత ఈజీ అయితే కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి వీరి ప్ర‌యాణం ఎలా జ‌రుగుతుంది?  మేర‌కు కూట‌మికి ప్ల‌స్ అవుతారు?  అనేది చూడాలి.