దేశంలో హాట్ టాపిక్:  ఏంటీ `తిరుప‌రంకుండ్రం` క‌థ‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు దారితీసిన అంశం. సుప్రీంకోర్టులోనూ విచార‌ణ‌కు కీల‌క ప్రాధాన్యం ఏర్ప‌డిన అంశం.. త‌మిళ‌నాడులోని `తిరుప‌రంకుండ్రం`. గ‌త వారం రోజులుగా రాష్ట్రంలోనే ప‌రిమిత‌మైన ఈ అంశంపై చ‌ర్చ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా కూడా జ‌రుగుతోంది. ప్ర‌ధాన మీడియాలో టాప్ స్టోరీగా కూడా ప్ర‌సారం అవుతోంది. మ‌రి అస‌లు ఈ తిరుప‌రంకుండ్రం అంటే ఏంటి?  దీనిచుట్టూ ఉన్న వివాదం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

తమిళనాడులోని మదురై జిల్లాలో ఉన్న తిరుపరంకుండ్రం అనేది ఒక ఆధ్యాత్మిక కొండ. మ‌న తిరుమ‌ల మాదిరిగా అనుకోవ‌చ్చు. ఇక్క‌డి దీప‌స్తంభంపై కార్తీక దీపం వెలిగించే ప్రదేశం ఉంది. ఈ విషయంలో నెలకొన్న వివాదమే తిరుపరంకుండ్రం విష‌యాన్ని దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మార్చేసింది. ఈ కొండపై సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో పాటు ముస్లింలు ప‌విత్రంగా భావించే `సికిందర్ బాదుషా దర్గా` కూడా ఉంది. శతాబ్ద కాలంగా కొండపై హక్కులు, ఆచారాల విషయంలో హిందువులు, ముస్లింల‌కు మ‌ధ్య ఈ కొండ వివాదంగా మారింది.

సాధారణంగా కార్తీక పౌర్ణమి రోజున(త‌మినాట ఈ నెల 24న నిర్వ‌హిస్తారు) కొండపై ఉన్న ఉచ్చి పిళ్ళయార్ ఆలయం వద్ద మహాదీపం వెలిగిస్తారు. అయితే, కొండ శిఖరాన దర్గాకు సమీపంలో ఉన్న ఒక రాతి స్తంభాన్ని ‘దీపతూణ్’ (దీపస్తంభం) గా పేర్కొంటూ, అక్కడ కూడా దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని హిందూ భక్తులు, సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్ర‌తి ఏటా వివాదం సాగుతున్నప్ప‌టికీ.. రాను రాను మ‌ద్ద‌తు పెరుగుతోంది. అలానే వివాదం కూడా పెరుగుతోంది.

అయితే.. అది పురాతన దీపస్తంభం కాదని, బ్రిటిష్ కాలంలో సర్వే కోసం ఏర్పాటు చేసిన ‘గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే’ స్తంభమని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాకుండా, దర్గాకు దగ్గరగా దీపం వెలిగించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తవచ్చని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, గ‌త ఏడాది కొండపై కొంద‌రు వ్య‌క్తులు మాంసాహారం తిన్నారనే ఆరోపణలతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీంతో కొండ‌వ‌ద్ద‌కు ఎవ‌రినీ వెళ్ల‌కుండా నిషేధం విధించారు.

అదే ఏడాది.. కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా దర్గా సమీపంలోని రాతి స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన కోర్టు.. ఆ స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతల కారణాలతో అప్పట్లో అధికారులు దీపం వెలిగించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసులు కూడా నమోదయ్యాయి.

ఇక‌, ఈ ఏడాది గ‌త హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ కార్తీక పౌర్ణ‌మి నాడు ఒక్కసారి మాత్రమే ఆ స్తంభంపై దీపం వెలిగించేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే, దీనివల్ల ఆ స్థలంపై ఎలాంటి శాశ్వత హక్కులు రావని స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, కేవలం ఆలయ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు మాత్రమే అక్కడికి వెళ్లి దీపం వెలిగించాలి. సాధారణ భక్తులు, రాజకీయ నాయకులు కొండపైకి వెళ్లకుండా, ఎలాంటి ఊరేగింపులు జరగకుండా జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. దీనిని కూడా ఓ వ‌ర్గం వ్య‌తిరేకిస్తోంది. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాల‌ని తాజాగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పిటిష‌న్ వేసింది. ఇలా.. తిరుప‌రం కుండ్రం వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.